విజయనగరం జిల్లాలో 34 మండలాలు ఉండగా.. వాటి పరిధిలో 959 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2011 గణాంకాల ప్రకారం జనాభా.. 23.44 లక్షలు కాగా.. గ్రామీణులు 18.53 లక్షల మంది. అక్షరాస్యత.. 58.89 శాతంగా ఉంది. రోడ్లు లేని గ్రామాలు 432, బస్సు సౌకర్యం లేనివి 400 గ్రామాలు. తాగునీరు సౌకర్యం లేనివి 17.5శాతం. పక్కా ఇళ్లకు నోచుకోనివి 21.6 శాతం. జిల్లాలో 2019 గణాంకాల ప్రకారం 1721 గ్రామీణ రహదారులున్నాయి. ఇవి 3,940.453 కిలోమీటర్లు ఉండగా.. కేవలం 444.737 కి.మీ మేర మాత్రమే బస్సులు తిరుగుతున్నాయి. 2014-19 మధ్య గ్రామాల్లో 587.36 కోట్లతో 1396.63 కి.మీ రహదారులు నిర్మించారు. అయినా.. పలు గ్రామాలు నేటీకి కనీసం రోడ్డు సదుపాయానికి నోచుకోలేదు.
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాల్లో పరిస్థితి మరీ దయనీయం. వారి ఆవాసాల నుంచి మైదాన ప్రాంతాలకు రావాలంటే.. కొండలు, గుట్టలు దాటుకు రావాల్సిన దుస్థితి. విజయనగరం జిల్లాలో కేంద్ర పథకం జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందించడానికి 464 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపారు. ఇందులో భాగంగా 4.20 లక్షల కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ పనుల పూర్తయితే... గ్రామాలకు పూర్తిస్థాయి తాగునీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే.. కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్న నేటికీ పల్లె ప్రాంతాల్లో పూర్తిస్థాయి తాగునీటి వసతులు సమకూరకపోవడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.
2009-10 సాక్షర భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 7.99 మంది నిరక్షర్యాసులున్నట్లు గుర్తించారు. వీరిలో 6.8 మందిని అక్షరాస్యులుగా మార్చారు. ప్రస్తుతం జిల్లాలో 1.91 మంది నిరక్షరాస్యులున్నట్లు వయోజన విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక జిల్లాలో పెద్ద ఎత్తున గృహనిర్మాణ పథకాలు అమలు చేయటంతో కొంత వరకు గ్రామీణులకు పక్కా ఇళ్లు సమకూరాయి. 2014-19 మధ్య కాలంలో గ్రామీణంలో 19,545 ఇళ్లు మంజూరయ్యాయి. తాజాగా 98,286 గృహాలు మంజూరు చేశారు. వీటి నిర్మాణాలు ప్రారంభం కావాల్సి ఉంది.
2017లో చేపట్టిన ఓడీఎఫ్ కార్యక్రమంతో విజయనగరం స్వచ్ఛ జిల్లాగా మారింది. అప్పటికీ జిల్లాలో 1.53లక్షల మరుగుదొడ్లు ఉన్నాయి. ఓడీఎఫ్లో 3,23,910 మరుగుదొడ్లు నిర్మించారు. ఇంకా పదివేల వరకు నిర్మించాల్సి ఉంది. అయితే.. వీటి వినియోగంపై 20 శాతం మందికి అవగాహన లోపం ఉన్నట్లు యూనిసెఫ్ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరటం లేదు.
బ్యాంకింగ్ సేవలు విస్తరించినా ఇప్పటికీ విజయనగరం జిల్లాలో చాలా గ్రామాలు ఆ సేవలకు దూరంగానే ఉన్నాయి. జిల్లాలో 147 గ్రామాల్లో 307 బ్రాంచ్లు ఉన్నాయి. ప్రతి 2 వేల జనాభాకు బ్యాంకు శాఖ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి.
ఇదీ చదవండి: రెంటికీ చెడ్డ రేవడిలా.. విలీన గ్రామాల దుస్థితి..!