విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన తాటిపూడిలోని గిరివినాయక కేంద్రం అటవీశాఖ పర్యవేక్షణలో ఉంది. పర్యటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించే లక్ష్యంతో అటవీ శాఖ రూ. కోటితో సకల సౌకర్యాలు కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. 2018లో పనులు కూడా ప్రారంభించింది. ఇంతలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దాదాపుగా రెండేళ్ల పాటు కదలిక లేక సందర్శకులు రాలేదు. మరోవైపు దీనిపైనే ఆధారపడిన గిరిజనులు ఉపాధిని కోల్పోయారు. ప్రస్తుతం నిధులు మంజూరు కావడంతో పనులు ఊపందుకున్నాయి. దాదాపుగా 90 శాతం పూర్తయ్యాయి.
ఆధ్యాత్మికత.. ఆహ్లాదంగా…
కొండపైన 16 అడుగుల వినాయక విగ్రహం ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంటోంది. జంతువుల బొమ్మలు పిల్లలకు వినోదాన్ని పంచుతున్నాయి. కుటుంబ సమేతంగా విడిది చేసేందుకు పది కాటేజీలు సిద్ధంగా ఉన్నాయి. విద్యుత్తుతో పాటు జనరేటర్ సౌకర్యం ఉంది. రుచికరమైన వంటకాలను అందించే క్యాంటీన్ అందుబాటులో ఉంది. వన సంరక్షణ సమితి పర్యవేక్షణలో ఈ కాటేజీ నడుస్తోంది. ఇందులో వందశాతం స్థానిక గిరిజన యువత ఉపాధి పొందుతుంది. వీటి నిర్వహణకు అటవీశాఖ మేనేజర్‌ను నియమించింది.
స్పీడు బోటు షికారు...
తాటిపూడి జలాశయంలో బోటు షికారు చేస్తే గోదావరిపై పాపికొండల్లో విహరించిన అనుభూతి కలుగుతుంది. రెండేళ్లుగా బోటు షికారు నిలిచిపోవడంతో పర్యటకులు రావడానికి ఆసక్తి చూపడం లేదు. తాజాగా అటవీ శాఖ రూ.10 లక్షలతో స్పీడు బోటును కొనుగోలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జలవిహారానికి అనుమతులు ఇవ్వగానే తిప్పేందుకు సిద్ధంగా ఉన్నామని రేంజ్ అధికారి ఆర్.రాజబాబు తెలిపారు. 10 మంది ప్రయాణించగల ఈ బోటుకు బీమా సౌకర్యం ఉందన్నారు.
“ గిరివినాయక కేంద్రాన్ని రెండేళ్లుగా ఆధునికీకరణ పనుల కోసం మూసివేశాం. పనుల పర్యవేక్షణ, తనిఖీలో భాగంగా త్వరలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పర్యటించనున్నారు. అనంతరం వారం పది రోజుల్లో కాటేజీ అందుబాటులోకి వస్తుంది. “-రాజబాబు, రేంజ్ అధికారి, గంగరాజు డిప్యూటీ రేంజ్ అధికారి
ఇవీ చదవండి: