కరోనా ప్రభావం పూల రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. లాక్‌డౌన్ కారణంగా వేలాది ఎకరాల్లో సాగైన పూలను అమ్ముకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కోసిన పూలన్నింటినీ రైతులు వృధాగా పారబోస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు రాక, ఉపాధి లేక, పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ పూల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచి మే మాసాంతం వరకు పండుగలు, శుభకార్యాలు, పెళ్లిలు అధికంగా జరుగుతుంటాయి. ఈ సీజనులో పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. పూలసాగులో రైతులకు కూడా మంచి లాభాలు వస్తుంటాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 50వేల కుటుంబాలు కనకాంబరం పూల సాగు పైనే ఆధారపడి జీవిస్తుంటాయి. వీరంతా ప్రతిరోజు విశాఖ తదితర ప్రాంతాలకు రైళ్లలో వెళ్లి కనకాంబరాలు అమ్ముకుంటారు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో పూసిన పూలను కోసేందుకు కూలీలు రాక, తరలించేందుకు రవాణా సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెళ్ళిళ్లు, శుభకార్యాలు వచ్చాయంటే కనకాంబరం పూలకు మంచి గిరాకీ ఉంటుందని రైతులు చెబుతున్నారు. లాక్‌డౌన్ వల్ల రవాణా వ్యవస్థ అంతా స్థంభించిందని, పూలను అమ్మేందుకు మరో మార్గం లేక తోటల్లోని పారబోస్తున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూల సాగుకు వేల రూపాయలు పెట్టుబడులు పెట్టామని అవి దక్కక, కుటుంబాలు గడవక దాదాపు 20 రోజులుగా తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామంటున్నారు రైతులు.
కరోనా ప్రభావంతో కోలుకోలేని దెబ్బతిన్న తమను ప్రభుత్వం ఆదుకుని, తగిన ఆర్ధిక సాయం అందించాలంటూ రైతులు కోరుతున్నారు.
ఇదీచదవండి