సొంత వైద్యం వికటించి గిరిజన బాలింత ప్రాణాలు కోల్పోయిన ఘటన పార్వతీపురం మండలంలో చోటుచేసుకుంది. మూడో కాన్పులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి మృతితో ఇంట్లో విషాదం అలముకుంది.
వివరాల్లోకి వెళితే...
విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బొడ్డవలసలో జీలకర్ర సింహాలమ్మ, పోలిరాజు దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. మగ బిడ్డ కోసం మూడో కాన్పు వరకు చూశారు. ఇంటి వద్ద నొప్పులు రావడంతో ఆస్పత్రికి వెళ్లే లోపు సాధారణ ప్రసవం జరిగి మగ బిడ్డ పుట్టాడు. మాయ గర్భసంచికి అంటుకొని ఉండిపోవడంతో కుటుంబీకులు సొంత వైద్యం చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకొంది.
కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స అందించినట్లు ప్రాంతీయాసుపత్రి సూపరింటెండెంటు వాగ్దేవి తెలిపారు. హిమోగ్లోబిన్ తక్కువ కావడంతో రక్తం ఎక్కించి వెంటిలేటర్‌పై చికిత్స చేయగా కోలుకున్నట్లు చెప్పారు. అక్కడ నుంచి విజయనగరం తరలించగా పరిస్థితి క్లిష్టంగా మారడంతో విశాఖ కేజీహెచ్‌కి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ వేకువ జామున ఆమె కన్ను మూసినట్లు వైద్యులు చెప్పారు. ప్రసవానికి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లుంటే తల్లి క్షేమంగా ఉండేదని వైద్యులు తెలిపారు.
తల్లిలాలనకు దూరం..
మూడో సంతానంలో బాబు పుట్టడంతో కుటుంబమంతా సంతోషంలో మునిగిపోయింది. బిడ్డ జన్మించిన ఒక్కరోజుకే భార్య మరణించడంతో రాజు తీవ్రంగా రోదించాడు. వరుసగా ఆరు, నాలుగేళ్లు వయసున్న బాలికలు, రోజు వయసున్న పసికందు ఆలనాపాలనా ఎవరు చూసుకుంటారని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: 'నా భార్య అతనే కావాలంటోంది'... పోలీసులను ఆశ్రయించిన భర్త..!