మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి వరకు రాజకీయంగా ఎదిగిన సాంబశివరాజు.. 8 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా పని చేశారు. ఏఐసీసీ కార్యదర్శిగానూ పనిచేసిన సాంబశివరాజు.. శాసనసభలో రెండుసార్లు ప్రొటెమ్ స్పీకర్‌గా సేవలందించారు.
1958లో సమితి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గజపతినగరం, సతివాడ స్థానాల నుంచి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1989-94లో మంత్రిగా పెన్మత్స సాంబశివరాజు బాధ్యతలు నిర్వర్తించారు. సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా ఉన్నారు.
సాంబశివరాజుకు కాంగ్రెస్ పార్టీలో అపారమైన గౌరవ మర్యాదలు ఉండేవి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో అత్యంత సాన్నిహిత్యం ఉండేది. రాజుగారు వచ్చారు అంటే.. వైఎస్ ఎంత బిజీగా ఉన్నాసరే వెంటనే లోపలికి పిలిచి మాట్లాడేవారు. ఆయన సూచించిన ప్రజోపయోగమైన పనులు చేసేవారు. తుది వరకు అత్యంత సాదా జీవితాన్ని గడిపిన రాజు కెరీర్ మొత్తం మీద ఒక్క అవినీతి మరక లేకపోవడం ఆయన ఔన్నత్యాన్ని సూచిస్తుంది. కోట్ల విజయభాస్కర రెడ్డి, చెన్నారెడ్డి, నేదురుమల్లి, అంజయ్య, దామోదరం సంజీవయ్య వంటి ముఖ్యమంత్రులతో రాజు సన్నిహితంగా మెలిగేవారు.
ప్రస్తుత మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు రాజకీయ ఓనమాలు దిద్దించింది మాత్రం సాంబశివరాజే. నిత్యం రాజు వెన్నంటే ఉంటూ సత్తిబాబు రాజకీయాలను ఆయన నుంచే నేర్చుకున్నారు. ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి.. వారి కష్టసుఖాలు ఎలా తెలుసుకోవాలి.. ఇవన్నీ రాజుగారు నేర్పిన పాఠాలే. తాజాగా జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఉన్న అప్పలనరసయ్య, వీరభద్రస్వామి, అప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన శిష్యగణం ఎక్కువే.
వైకాపాకు ప్రస్తుతం జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు లీడర్లు బోలెడు మంది ఉన్నారు. కానీ ఆనాడు జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తరువాత విజయనగరం ఓదార్పు యాత్రకు వచ్చేసరికి ఇక్కడ ఆయన్ను తొలిసారిగా ఆహ్వానించింది, ఆదరించింది, సాంబశివరాజే. 77 ఏళ్ల వయసులో ప్రతి గ్రామానికి వెళ్లి మద్దతు కూడగట్టారు. అయితే ప్రభుత్వం సాంబశివరాజుకి నిరాదరణే ఎదురైంది. దానికి తోడు వయోభారం ఆయన్ను కుంగదీసింది.
ఇదీ చదవండి: నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన ప్రభుత్వం