విజయనగరం జిల్లాలో నేటి నుంచి ఈ నెల 20 వరకు 'మనం - మన పరిశుభ్రత' పేరుతో పారిశుద్ధ్య పక్షోత్సవాలు చేపట్టారు. ఈ మేరకు పక్షోత్సవాల సన్నద్ధత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్తోపాటు జిల్లా పరిషత్ సీఈవో వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి సునీల్రాజ్ కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ రవితో పాటు.., పలు విభాగాలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ర్యాలీలో జానపద కళాకారులు తప్పెట గుళ్ళు, డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. 330 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
పరిశుభ్రం, పచ్చదనం, ఆరోగ్యంగా మన విజయనగరం అనే నినాదంతో జిల్లాలో గత రెండేళ్లుగా కార్యక్రమాలు చేపడుతున్నట్టు జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. విజయనగరం కలుషిత నీరు, గాలి ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతాయని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వంతో పాటు.., ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటేనే పరిసరాల పరిశుభ్రత సాధ్యమవుతుందన్నారు. అనంతరం పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించి, పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన కిట్లు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి...