విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బందలుప్పికి చెందిన మర్రాపు చంద్రమౌళి... డిగ్రీ తర్వాత విశాఖలో కార్లు అద్దెకు ఇచ్చే ఓ సంస్థలో చేరాడు. జల్సారాయుడైన చంద్రమౌళితో వేగలేక భార్య వదిలేసింది. అనంతరం పార్వతీపురానికి చెందిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని, అక్కడే కార్ల వ్యాపారం ప్రారంభించాడు. రెండు కార్లు ఉన్న యజమానులను లక్ష్యంగా దొంగజిత్తులు వేశాడు. ఒక కారు అద్దెకిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తానని నమ్మించాడు. అలా తీసుకున్న కార్లకు రెండు మూడు నెలలు క్రమం తప్పుకుండా అద్దె చెల్లించేవాడు. ఆ తర్వాత ముఖం చాటేసేవాడు. అద్దె సంగతి దేవుడెరుగు... కారు కూడా తిరిగిచ్చేవాడు కాదు. కొన్నాళ్లకు మరో ఇద్దరితో కలిసి ఇంకో ఎత్తు వేశాడు. అద్దె పేరుతో తీసుకున్న కార్లను తనఖా పెట్టడం ప్రారంభించాడు. అలా వచ్చిన డబ్బుతో జల్సాల్లో మునిగితేలాడు.
రాజేష్ ఫిర్యాదుతో వెలుగులోకి..
శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం తురాయివలసకి చెందిన బాధితుడు పిన్నింటి రాజేష్ ఫిర్యాదుతో చంద్రమౌళి మోసం వెలుగుచూసింది. రాజేష్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పార్వతీపురం పోలీసులు.... నిందితుడు చంద్రమౌళిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో అద్దె కార్ల దందా బయటపడింది. చంద్రమౌళికి సహకరించిన శ్రీకాకుళంజిల్లా సీతంపేటకు చెందిన శివరామకృష్ణను కూడా అరెస్టు చేసిన పోలీసులు.. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన మరో నిందితుడు రవి కోసం వెదుకుతున్నారు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న 29 కార్ల విలువ 2 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. చంద్రమౌళి లాంటి మోసగాళ్ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:
Black magic: చేతబడి నెపంతో అర్ధ నగ్న పూజలు.. వీడియో తీసి యువతిని బ్లాక్ మెయిల్!