Jogimpeta Gurukul Vidyalaya News: విజయనగరం జిల్లా సీతానగరం మండలం జోగింపేట గురుకుల విద్యాలయంలో రణరంగం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థుల మధ్య జరిగిన గొడవ.. వారి తల్లిదండ్రులు.. విద్యార్థులు, ప్రిన్సిపల్‌పై దాడికి దారి తీసింది. అంతటితో ఆగకుండా ఇరువర్గీయులు.. విద్యాలయ ప్రాంగణంలో తలపడ్డారు. గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి ఏడాది చదవుతున్న ముగ్గురు విద్యార్థుల ప్రవర్తన బాగోలేదని.. సీనియర్ ఇంటర్ విద్యార్థులు శుక్రవారం మందలించారు. ఈ విషయంపై జూనియర్ ఇంటర్ విద్యార్ధులు వారి కుటుంబసభ్యులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఇవాళ విద్యాలయానికి వచ్చి ప్రిన్సిపల్ వద్దకు సీనియర్ విద్యార్థులను పిలిపించారు. అనంతరం తల్లిదండ్రులు ఒక్కసారిగా విద్యార్థులు, ప్రిన్సిపల్‌పై దాడి చేశారు. కార్యాలయ గదిలోకి ప్రవేశించి టేబుల్స్, అద్దాలను సైతం ధ్వంసం చేశారు.
పరస్పరం దాడులు
ఈ విషయాన్ని తెలుసుకున్న సీనియర్ విద్యార్ధుల తల్లిదండ్రులూ.. కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్ వరప్రసాద్‌తో గొడవకు దిగారు. మా పిల్లలను దూషించి, దాడి చేసిన వారిని పిలిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం జూనియర్ ఇంటర్‌కు చెందిన ముగ్గురు విద్యార్ధులపై దాడికి పాల్పడ్డారు.
పోలీసుల రాకతో...
ఇలా.. ఒకరి తర్వాత ఒకరు.. వాగ్వాదం, ఘర్షణకు దిగడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని మిగిలిన విద్యార్ధులు, అధ్యాపకులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న సీతానగరం ఎస్సై నీలకంఠం.. తమ బృందంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సముదాయించారు. దీంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ప్రిన్సిపల్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి..
VIRASAM Maha Sabhalu: నెల్లూరులో విరసం మహాసభలు.. పెద్దసంఖ్యలో పోలీసుల నిఘా!