విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల ప్రయత్నిస్తోందని ఏపీఐఐసీ ఛైర్పర్సన్ ఆర్కే రోజా అన్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ అంశంపై కార్మిక సంఘాలతో మాట్లాడి... ప్రధానమంత్రికి లేఖ రాశారని తెలిపారు.
లోక్ సభ, రాజ్యసభలో వైకాపా ఎంపీలు కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పారని రోజా వివరించారు. విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని ఇవాళ రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు... ఆమె పేరిట ప్రత్యేక అర్చనలు, పూజలు చేసి....తీర్థ ప్రసాదాలు అందజేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అన్న రోజా... ఎంతో మంది త్యాగ ఫలమని గుర్తుచేశారు.
ప్రైవేటీకరణ నుంచి ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు రోజా. ఇప్పటికే సీఎం., కార్మిక సంఘాలతో చర్చించి., ప్రధానికి కూడా లేఖ రాశారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నాయకులు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు. అశోక్ గజపతిరాజు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులుపడ్డాయని రోజా ఆరోపించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటున్నామన్న చంద్రబాబు... ప్రధానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
తెలంగాణలో వైఎస్ నాటి స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందాం: షర్మిల