తెదేపా ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో... నేడు వైకాపా ప్రభుత్వం అదే బాటలో నడుస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ సనీల్ దియోధర్, ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మాజీ విప్, తెదేపా నేత గద్దె బాబురావు భాజపాలో చేరారు. అనంతరం మాట్లాడిన సోము వీర్రాజు... తెదేపా, వైకాపాలపై విమర్శలు గుప్పించారు.
ఎన్టీఆర్ నిజమైన వారసురాలైన పురందేశ్వరికి జాతీయ స్థాయిలో భాజపా తగ్గిన గుర్తింపు ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. అలాంటి పార్టీలో ఉన్న కార్యకర్తలు భాజపాలోకి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న 22 పథకాల్లో కేంద్రం ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పారు. మోదీ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై పోరాడతామని వ్యాఖ్యానించారు. ప్రాధాన్యత తక్కువ ఉన్న పదవులను బీసీలకు ఇచ్చి మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి