వివోఏ ఉద్యోగాలను అభద్రతలోకి నెట్టే విధంగా సెర్ప్ విడుదల చేసిన సర్క్యులర్‌లోని అంశాలను ఉపసంహరించాలని వివోఏ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ ప్రకారం.. గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టి, వేతనాల్లో కోత విధించడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే 8వేల రూపాయల వేతనంలో.. 3 వేల మేర కోత పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పని విషయంలో గ్రేడింగ్ పెట్టినా వేతనాల్లో కోత విధించరాదని కోరారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను అర్ధాంతరంగా తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖలో ఎన్నడూలేని విధంగా 45 ఏళ్లు పూర్తయిన వారిని తొలగించి కొత్త వారిని నియమించాలని నిర్ణయించడం దారుణమని అన్నారు.
విశాఖ జిల్లాలోని వివోఏ ఉద్యోగులు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో వివోఏ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు వీవీ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ రూపా దేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొత్త వైద్య కళాశాలలకు జనవరి 16లోగా టెండర్లు పూర్తి చేయాలి: సీఎం