త్వరలో హరిద్వార్ వేదికగా ప్రారంభం కానున్న కుంభమేళాలో విశాఖ శ్రీ శారదాపీఠం సేవలను అందించనుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి హరిద్వార్ వెళ్లే భక్తుల కోసం విశేష సేవలను అందించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ విషయమై ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓంప్రకాష్ తో ఉత్తర పీఠాధిపతులు స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి చర్చించారు. ఈ మేరకు సోమవారం అక్కడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డెహ్రాడూన్ లో కలిసారు.
విశాఖ శ్రీ శారదాపీఠం తరపున భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించదలచినట్టు సీఎస్‌కు వివరించారు. సేవా కార్యక్రమాలపై విశాఖ శ్రీ శారదాపీఠంతో సమన్వయం చేసుకోవాలని మేళా అధికారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. విశాఖ శ్రీ శారదాపీఠంతో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఎంతో అనుబంధముందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓంప్రకాష్ అన్నారు.
పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామీజీలు ఏటా ఉత్తరాఖండ్ వేదికగా చేసే చాతుర్మాస్య దీక్షను గుర్తుచేసుకున్నారు. కుంభమేళాలో సేవాకార్యక్రమాల విషయమై చర్చించేందుకు ఉత్తరాఖండ్ వెళ్లిన స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వేకువజామున రిషికేష్ లో గంగాతీరాన అనుష్టానం చేసుకున్నారు. ఆ తర్వాత వీరభద్ర మందిర్ ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి డెహ్రాడూన్ వెళ్ళారు. అక్కడ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రావత్ సలహాదారులు కేఎస్ పన్వర్, స్పెషల్ సెక్రటరీ డాక్టర్ ప్రగ్ దకాటేలు స్వామి స్వాత్మానందేంద్రను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం కుంభమేళాలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: రాష్ట్రమంతటా ముందుగానే సంక్రాంతి శోభ..