Violations at Rushikonda: సీఎంగా బాధ్యతలు చేపట్టాక కలెక్టర్లతో మొదటి సమావేశం ఉండవల్లిలోని ప్రజావేదిక భవనంలో నిర్వహించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) వీరావేశంగా మాట్లాడారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాలాంటూ చెప్పారు. ఆ మర్నాడే ప్రజావేదికను కూల్చేయించారు. ప్రజావేదికపై నాడు సుద్దులు చెప్పిన జగన్.. నేడు రుషికొండపై చేసిందేంటి? చేస్తోందేంటి..? రుషికొండకు ఎందుకు గుండుకొట్టారు.? మధ్యలో అది కవర్ చేసుకోడానికి గ్రీన్ మ్యాట్ ఎందుకు కప్పారు? ఈ ప్రశ్నలకు జగన్ నోరు మెదపరు. ఎందుకంటే రుషికొండలో చేసిందంతా చట్టవిరుద్ధం.. జరిగింది పర్యావరణ విధ్వంసం!
హైకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీయే రుషికొండపై జగన్ సర్కార్ అడ్డగోలు వ్యవహారాల్ని నిగ్గుతేల్చింది. మరిప్పుడు.. జగన్ ప్రజావేదికలో చెప్పిన నీతులు పాటిస్తారా? రుషికొండపై అక్రమ నిర్మాణాలు కూల్చేయిస్తారా?. రుషికొండకు పక్కా ప్రణాళికతోనే.. వైసీపీ సర్కార్ గుండుకొట్టించింది. 3 రాజధానుల ప్రకటన చేసిన వెంటనే.. అక్కడ క్యాంప్ కార్యాలయ ఆలోచనకు తెరలేపింది. అప్పట్లో సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ గుజరాత్‌కు చెందిన ఒక ఆర్కిటెక్ట్‌తో కలిసి.. విశాఖపట్నంలోని రుషికొండ సహా వివిధ ప్రాంతాల్లో పర్యటించారు.
రుషికొండపై ఏపీటీడీసీ ఉల్లంఘనలకు పాల్పడింది: కేంద్రానికి విశ్రాంత ఐఏఎస్ లేఖ
రాజధానిపై కేసులు కోర్టులో ఉండగానే.. రుషికొండపై క్యాంప్ ఆఫీస్ ప్రణాళికను.. అమల్లో పెట్టారు. 5.99 ఎకరాల్లో ఉన్న.. హరిత రిసార్ట్స్‌ను కూల్చేశారు. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తే.. పర్యాటకుల్ని మరింత ఆకట్టుకునేలా పునర్నిర్మిస్తామంటూ.. మభ్యపెట్టారు. నగరపాలక సంస్థ నుంచి అనుమతులు తీసుకోకుండానే.. ప్రాజెక్టు పనులు ప్రారంభించేశారు. అటువైపు ఎవర్నీ వెళ్లనీయకుండా ఆంక్షలుపెట్టారు. తీరప్రాంత.. పర్యావరణ నిబంధనల్ని.. తుంగలో తొక్కారు. కోర్టులు, ఎన్జీటీ (National Green Tribunal) ఆదేశాల్నీ బేఖాతరు చేశారు.
రుషికొండపై సుమారు రూ.350 కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి విలాసవంతమైన భవంతి కట్టించారు. పర్యాటక రిసార్ట్ అని కొన్నాళ్లు.. హోటల్ కడుతున్నామని కొన్నాళ్లు.. మంత్రులు, అధికారులు నోటికొచ్చిన పద విన్యాసాలు చేసారు. విశాఖకు మకాం మారుస్తానని జగన్ ప్రకటించాక..అసలు ముసుగు తొలగించారు. అక్కడ సీఎం నివాసం ఉంటే తప్పేంటంటూ. ఎదురు ప్రశ్నించారు. రుషికొండపై భవనాలే సీఎం నివాసానికి అనుకూలమని అధికారుల కమిటీతో నివేదిక కూడా ఇప్పించారు.
సీఎం రుషికొండపైనే ఉండాలనుకుంటే నేరుగా వెళ్లొచ్చుకదా! ఎందుకీ డొంక తిరుగుళ్లు.? ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్షల కోసమంటూ ముసుగు ఎందుకు? అదే నిజమనుకుంటే విశాఖలో ఇక భవనాలే లేవా? ఓ వైపు.. రోడ్లు వేయడానికే డబ్బుల్లేవంటూ.. మరోవైపు కోట్లు కుమ్మరించి అంత విలాసవంతమైన భవనం నిర్మించాల్సిన అవసరముందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.?
కార్యనిర్వాహక రాజధాని పేరుతో విశాఖపై ప్రేమ ఒలకబోస్తున్న.. వైసీపీ పెద్దలు, ముఖ్యమంత్రి సన్నిహితులు విశాఖ ఆస్తుల్ని.. ఇప్పటికే గుప్పిటపట్టారు. దసపల్లా భూములతోపాటు.. రేడియంట్, ఎన్‌సీసీ, హయగ్రీవ వంటి వివిధ ప్రాజెక్టులకు చెందిన రూ.వేల కోట్ల విలువైన భూముల్ని హస్తగతం చేసుకున్నారు. వాటన్నింటి విలువ 45 వేల కోట్లు ఉంటుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటిపై కోర్టుల్లో పలు కేసులూ ఉన్నాయి.