విశాఖ జిల్లాలో ఓ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు అతి దారుణంగా హత్య చేసిన ఘటనకు సరిగ్గా ఈ రోజుకి రెండేళ్లు గడిచింది. అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, తెదేపా మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను డుంబ్రిగుంట మండలం లివిటిపుట్టు గ్రామం వద్ద మావోయిస్టులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన రాష్ట్రాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా నేతలు లివిటిపుట్టుకు వెళ్తుండగా మావోయిస్టులు వారి వాహనాలకు అడ్డగించి కాల్పులు జరిపారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అరకులోయలో ఈ ఘటన జరగటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు చాకచక్యంగా నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. ఆనాడు జరిగిన ఘటనకు వెంటనే స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.... నష్టపోయిన రెండు కుటుంబాలను అక్కున చేర్చుకున్నారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్కి... ఆనాడు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సోమ కుమారుడిని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయాన్ని సైతం అందజేశారు.
ఇదీ చదవండి