కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో కార్మిక, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్. నర్సింగరావు మాట్లాడుతూ..ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తామనడంతో బ్యాంకు ఉద్యోగులంతా ఐక్యంగా సమ్మెకు దిగారని తెలిపారు. ఈ నెల 17,18 తేదీల్లో జనరల్ ఇన్సూరెన్స్, జీవిత బీమా సంస్థ ఉద్యోగులు సమ్మె ద్వారా మోదీ విధానాలను తిప్పికొట్టడానికి సిద్దమవుతున్నారని పేర్కొన్నారు.
కడప జిల్లాలో....
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కడపలో ట్రేడ్ యూనియన్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో నడుస్తోందనే కారణంతో ప్రైవేట్‌పరం చేస్తామనడం సమంజసం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రజా సంఘాల ఛైర్మన్ ఆర్.ఎన్ రాజా కోరారు.
ప్రకాశం జిల్లాలో....
విశాఖ ఉక్కు పరిశ్రమ, బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రకాశం జిల్లా చీరాలలో ఏఐటీయూసీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు బత్తుల శామ్యూల్ మాట్లాడుతూ...స్టీల్ ప్లాంట్ నుంచి బీమా, ఎయిర్ పోర్టుల వరకు అన్నిటినీ కేంద్రప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తోందని మండిపడ్డారు.
విజయనగరం జిల్లాలో....
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విజయనగరంలో సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ...అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను...ప్రైవేట్‌పరం చేయడానికి మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సుబ్బరావమ్మ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని...లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: