TDP Leaders Visit Skill Development Centre in Visakha AU: విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పరిస్థితి చూస్తే బాధ కలుగుతోందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్షతో ఏయూలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను డంపింగ్ యార్డులా తయారుచేసి.. అభాసుపాలు చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సెంటర్ వల్ల చాలామంది విద్యార్థులకు మేలు జరిగిందన్న ఆయన.. ఇలా చెప్పడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
ఏయూలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను గంటా శ్రీనివాసరావు సహా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బృందం సంర్శించింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటులో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలను కాదని నిరూపించేందుకు పలుమార్లు ఏయూలో ఉన్న స్కిల్ సెంటర్లకు వెళ్లేందుకు గంటా ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఎప్పటికప్పుడు స్కిల్ సెంటర్లకు వెళ్లకుండా స్థానిక పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో ఈసారి ఎవరికీ సమాచారం అందించికుండా టీడీపీ నేతలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పరిశీలించారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆయన.. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షలమంది విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ కావాలని దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో 13 జిల్లాల్లో దాదాపు 40 సెంటర్లు ప్రారంభించారని వివరించారు. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇండియాలోనే బెస్ట్ అని ప్రచారం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ తన కక్షపూరిత రాజకీయాల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను బలిచేసిందని గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. తాను ఎన్నిసార్లు ఈ స్కిల్ సెంటర్లను సందర్శించేందుకు వద్దామన్నా పోలీసులు అడ్డుకున్నారని, అందుకే ఇప్పుడు ఆకస్మికంగా వచ్చామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో స్కిల్ సెంటర్ల పనితీరుపై మంత్రులు, సలహాదారులు, సామంతులు ఎవరొచ్చినా బహిరంగ చర్చకు సిద్ధమని వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
Atchannaidu Sensational Comments on CID: ఆధారాలు చూపలేక సీఐడీ మరోసారి బోల్తా పడింది: అచ్చెన్నాయుడు
ఏపీలో ఉన్న 40 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో దేనివద్దకైనా పరిశీలంచేందుకు వెళ్తామన్న ఆయన.. అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే శాశ్వతంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని, త్వరలోనే ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. యువతకు మంచి శిక్షణను అందించిన స్కిల్ డెవలప్మెంట్ సంస్థలపై రాజకీయ కక్షతో దారుణంగా ప్రవర్తించడం.. విద్యార్థుల భవిష్యత్తుకు మంచిది కాదని నేతలు వివరించారు.
" స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల పనితీరుపై మంత్రులు, సలహాదారులు, సామంతులు ఎవరొచ్చినా బహిరంగ చర్చకు సిద్ధం. అక్రమాలు జరిగినట్టు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. కేవలం రాజకీయ కక్షతో స్కిల్ సెంటర్లను వైసీపీ ప్రభుత్వం డస్ట్ బిన్‌గా మార్చేసింది." - గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి