విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ధన్వంతరి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారు జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక ఆరాధన చేశారు. గంగధార నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం చేసి.. ఆలయం పక్కనే ఉన్న యాగశాలలో స్వాతి నక్షత్ర హోమం పూజలు, ధన్వంతరి హోమం, సుదర్శన యాగం నిర్వహించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలు మెరుగైన ఆరోగ్యం పొందాలని హోమాలు నిర్వహించినట్లు ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ సంచయిత గజపతి రాజు, ఆలయ ఈవో సూర్యకళ తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలను కరోనా భయం వెంటాడుతున్న తరుణంలో ధన్వంతరి హోమం నిర్వహించడం వల్ల.. భయాలు తొలగడంతో పాటు వ్యాధులు, రుగ్మతలు తొలగిపోతాయని స్థానాచార్యులు రాజగోపాల్ చెప్పారు. గతంలో కంచితో పాటు ఇతర ప్రాంతాల్లో ఇలాగే చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దేవ వైద్యులైన ధన్వంతుడ్ని పూజిస్తే సర్వ రోగాలు హరించుకుపోతాయని.. త్వరలోనే కరోనా నుంచి సురక్షితంగా ప్రజలు బయట పడతారని రాజగోపాల్ వివరించారు.
ఇవీ చదవండి: