విశాఖ జిల్లాలోని సీలేరు జలవిద్యుత్కేంద్రంలో 60 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మొదటి యూనిట్ గత ఏడాది డిసెంబరులో రోటార్ ఎర్త్ సమస్యతో మరమ్మతుకు గురైంది. ఈ పనులను అధికారులు ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కంపెనీకి అప్పగించారు. మరమ్మతు చేసి యూనిట్‌ను వినియోగంలోకి తీసుకువచ్చి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. పక్షం రోజులు తిరక్కుండానే ఫిబ్రవరిలో యూనిట్ మొరాయించింది. దీంతో మళ్లీ మరమ్మతు పనులు చేపట్టారు. అవసరమైన సామగ్రిని బెంగళూరు నుంచి తెచ్చేలోగా లాక్‌డౌన్ విధించడంతో పనులు నిలిచిపోయాయి. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఆగస్టులో పనులను పునఃప్రారంభించారు. నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు సమస్యను గుర్తించలేకపోయారు. యూనిట్‌ను పూర్తిగా విడదీసి సమస్యను పరిష్కరించాలని విద్యుత్కేంద్రం అధికారులు ప్రతిపాదించగా.. జెన్‌కో ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారు. అంచనాలు రూపొందించి టెండర్ పిలిచారు. మొదటి యూనిట్‌లో తలెత్తిన సమస్యను గుర్తించలేక చేతులెత్తేసిన ప్రైవేటు ఇంజినీరింగ్ కంపెనీకే టెండర్‌ను ఖరారు చేయడం గమనార్హం.
సమస్య ఒక్కటైతే.. చేసింది మరొకటి
టెండరు దక్కించుకున్న సంబంధిత కంపెనీ మొదటి యూనిట్‌లో రోటార్ ఎర్త్ సమస్య ఉత్పన్నమైందని మరమ్మతు చేయగా.. చివరకు యూనిట్ అడుగు భాగంలోని రన్నర్ లేబ్రన్స్ రింగులు దెబ్బతిన్నాయని, వాటితోపాటు డీజీబీ బేరింగులూ పాడయ్యాయని గుర్తించారు. సమస్యేంటో తెలుసుకునేందుకు ఇన్నాళ్లు పడితే.. మరమ్మతు చేయడానికి ఎంత సమయం తీసుకుంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అంచనాలు పెరుగుతున్నాయి తొలుత రూ.39 లక్షల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించాం. రోజుకో కొత్త సమస్య వెలుగు చూస్తుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు జెన్‌కో ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా మరమ్మతు పనులు పూర్తి చేసి యూనిట్‌ను వినియోగంలోకి తీసుకువస్తాం.
- ఉదయ్‌కుమార్, ఇన్‌ఛార్జి కార్యనిర్వాహక ఇంజినీరు
ఇదీ చదవండి : రాజధాని గురించి భాజపా సూచనలపై ఆలోచిస్తాం: ధర్మాన