Pregnant woman problem in manyam : విశాఖ మన్యంలో జీవిస్తున్న గిరిజనుల కష్టాలు అన్నీఇన్నీ కావు. కనీస అవసరాలు తీర్చుకునేందుకూ ఎంతో ప్రయాస పడుతుంటారు. ఎక్కడో దూరంగా విసిరేసినట్టు ఉండే గ్రామాలకు రహదారి సౌకర్యం ఉండటం గగనం. వైద్య సౌకర్యాలు అందని ద్రాక్షే. గూడేల్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే అంతే సంగతులు. సమయానికి ఆస్పత్రికి చేరుకోలేక చాలా మంది మృతి చెందిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా చింతపల్లి మండలంలోని తాటిబంద గ్రామానికి చెందిన ఓ గర్భిణి నడిరోడ్డుపైనే ప్రసవించింది. డోలీలో ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో సహాయంగా వచ్చిన మహిళలు దుప్పట్లు, చీరలు అడ్డుగా పెట్టి పురుడు పోశారు.
విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలంలోని తాటిబంద గ్రామానికి చెందిన కొర్రా రంగారావు భార్య చిన్ని గర్భిణి. నెలలు నిండటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. కానీ సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఇంటివద్ద ప్రసవించేలా ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చినా వాహనం రాకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థుల సహకారంతో డోలీపై రెండు కిలోమీటర్లు మోసుకెళ్లారు. ఈ లోగా చిన్నికి పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో చేసేదేమీ లేక గర్భిణీకి సాయంగా వచ్చిన మహిళలు...చిన్నిని కిందికి దించారు. చీరలు, దుప్పట్లను అడ్డుగా పెట్టి పురుడు పోశారు. కాన్పు కష్టమైనా పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రసవానంతరం తల్లీబిడ్డలను డౌనూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి తమకు, డోలీ మోతల నుంచి విముక్తి కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
గతంలో జరిగిన సంఘటన...
Pregnant woman problem in manyam : పాడేరు మారుమూల గ్రామాల్లో గర్భిణీలకు అష్టకష్టాలు తప్పడం లేదు. బిడ్డకు జన్మనివ్వాలంటే వారిని మోస్తూ వాగులు దాటించాల్సిందే. జి.మాడుగుల మండలం రసరాయిలో ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ కొండ వాగు పొంగి ప్రవహించడంతో వాహనం రాలేకపోయింది. దీంతో బంధువులు అతి కష్టం మీద ఇలా పల్లకిలో మోసుకెళ్లి రహదారికి చేర్చారు. అక్కడి నుంచి ప్రైవేటు వాహనంలో జి.మాడుగుల ఆస్పత్రికి తరలించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా... ఎంత మంది అధికారులు మారినా తమ తలరాతలు మాత్రం మారటం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
ఇవీచదవండి.