విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో ఈ నెల 7న స్టైరీన్ ఆవిరి లీకైనప్పుడు మరికొన్ని విషవాయువులూ విడుదలయ్యాయని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గుర్తించారు. లీకేజీ అనంతరం ఆ ప్రాంతంలో ఏమేమి ఇతర వాయువులు ఉన్నాయో నమూనాలు సేకరించి పరిశోధిస్తున్నారు. సంస్థ పరిసరాల్లో స్టైరీన్‌తోపాటు పలు హైడ్రోకార్బన్ల జాడను గుర్తించారు. వాటన్నింటినీ కలిపి టి.వి.ఒ.సి.(టోటల్ ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్)గా పేర్కొంటున్నారు. ఇందులో 80 శాతం వరకు అత్యధిక గాఢతతో స్టైరీన్ ఆవిరి, 20 శాతం ఇతర వాయువులు ఉన్నాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ట్యాంకులో ఉష్ణోగ్రత పెరిగిన కారణంగా స్టైరీన్ రసాయనిక చర్యకు గురై పాలిమరైజేషన్ చెందిందన్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో విడుదలైన ఆవిరిలో బెంజీన్, ఇథలీన్ తదితర వాయువులున్నట్లు గుర్తించారు. వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి, మరికొన్ని ప్రమాదరహితమైనవి. సమీప గ్రామాల్లోని ప్రజలు అస్వస్థతకు గురికావడానికి స్టైరీన్ ఆవిరితోపాటు ఇతర విషవాయువులూ కొంతవరకు కారణమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నమూనాలను ప్రయోగశాలల్లో పరీక్షించాకే అవి ఏయే స్థాయుల్లో ఉన్నాయో స్పష్టత వస్తుంది.
రసాయన శాస్త్ర నిపుణులున్నారా?
రసాయనాల్ని భారీగా వినియోగించే సంస్థలు సాధారణంగా రసాయనశాస్త్ర నిపుణుల్ని నియమించుకుంటాయి. ప్రమాదాలకు గల అవకాశాలు.. ఒకవేళ అనుకోని ఘటనలు సంభవిస్తే తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారు చెప్పగలుగుతారు. ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాద సమయంలో రసాయనశాస్త్ర నిపుణులు లేకపోవడం వల్లే పరిస్థితి తీవ్రతను అక్కడున్న సిబ్బంది అంచనా వేయలేకపోయినట్లు తెలుస్తోంది.
* ఎల్‌జీ పాలిమర్స్ ఘటన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం విశాఖలోని 20 కర్మాగారాల్లో పరిస్థితులను నాలుగు బృందాలతో నిశితంగా అధ్యయనం చేయిస్తోంది.
ప్రభావిత గ్రామాల్లో సురక్ష ఆసుపత్రి
ప్రభావిత గ్రామాల్లో కీలక కార్యక్రమాలు చేపడతామని ఎల్‌జీ పాలిమర్స్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రజల ఆరోగ్యపరిస్థితిని పర్యవేక్షించేందుకు ‘సురక్ష ఆసుపత్రి’ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. గ్రామీణుల సమస్యలకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశామని,వారు 08912520884, 08912520338 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపింది. ఆరోగ్యం, పర్యావరణ ప్రభావాలపై సర్వే నిర్వహించేందుకు త్వరలో ప్రత్యేక సంస్థల్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రజాభిప్రాయం మేరకు సీఎస్‌ఆర్ నిధులతో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రాతిపదికన ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. లీకేజీవంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అందరి సహకారం అవసరమని తెలిపింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని వెల్లడించింది. భద్రతలో భాగంగా ప్లాంటులో ఉన్న స్టైరీన్ మోనోమర్ (ఎస్‌ఎం)ను వెస్సెల్స్ ద్వారా దక్షిణకొరియాకు తరలిస్తున్నామని తెలిపింది. లీకేజీ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై దక్షిణకొరియా నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల బృందం విచారణ చేస్తోందని వివరించింది. పీడిత గ్రామాల్లో ఆహారం, వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపింది. బాధితులకు ఔషధాలు ఇవ్వడం, ఇళ్లకు అవసరమైన వస్తువుల్ని సమకూర్చడం, ఇళ్ల శుభ్రతకు సంబంధించిన విషయాల్లో సహకరిస్తున్నామని పేర్కొంది.
ఇదీ చదవండి :