గుర్రం పందాలు, ఎడ్ల పందాలు, కొడి పందాలు మీరు చూసే ఉంటారు. ఇందులో కొత్త ఏం ఉంటుందన్నది మీ ప్రశ్నే అయితే దానికి సమాధానం పందుల పందేలు. అదేంటంటారా విశాఖపట్నం పట్టణం గాజువాకలోని పెదగంట్యాడ ప్రాంతంలో ఈ పందాలు జరిగాయి. పందుల పోటీలపై పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లు కూడా నిర్వహించారు. సమతానగర్ జంక్షన్లో గుమిగూడిన పందుల పెంపకందారులు అక్కడ పెద్ద హడావుడినే సృష్టించారు. రహదారిపైనే సూకరాలు అరుస్తూ పరుగులు తీసేలా చేసిన కొందరు యువకుల నిర్వాకం స్దానికులకు చిరాకు తెప్పించింది.
స్ధానికుల ఫిర్యాదుతో ఆ ప్రాంతానికి పోలీసులు వచ్చేసరికి యువకులు పరారయ్యారు. వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
విశాఖలోని పారిశ్రామిక ప్రాంతంగా గాజువాకకు ఎంతో ఖ్యాతి ఉంది. అలాగే ఇక్కడ పందుల సంచారం కూడా ఎక్కువే. ఏ వీధిలో చూసినా గుంపులు గుంపులుగా ఇవి దర్శనమిస్తాయి. ఇక్కడ పందుల పెంపకందార్లు పరిసరాలలో నివాసంతో వీటిని కూడా యధేచ్ఛగా వదిలేయడం సామాన్యంగా జరిగిపోతోంది. విశాఖ మహా నగర పాలక సంస్థ ఏకంగా షూటర్లను పెట్టి కాల్చేందుకు యత్నిస్తున్నా.. అవి ఇస్తున్న ఫలితాలు అంతంత మాత్రమే. పందుల పెంపకందార్లు కూడా పెద్ద ఎత్తున ఎదురుదాడికి దిగడం కూడా తరుచుగా సాగుతోంది. ఈ తరుణంలో ఈ ఉదయం చోటు చేసుకున్న పందుల పోటీలు స్దానికులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టాయి.
ఇదీ చదవండి: తుపాకీ పక్కన పెట్టి.. చాక్‌పీస్ చేత పట్టి