రసాయన పరిశ్రమలపై సరైన నిఘా లేకపోవటం వల్లే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవక ముందే నంద్యాలలోని ఎస్పీవై పరిశ్రమలో, విశాఖ సాయినార్ పరిశ్రమలో ప్రమాదాలు జరిగాయన్నారు.
రసాయన పరిశ్రమల్లో రక్షణ చర్యలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జనసేన చెబుతున్నా... ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై చేపట్టిన విచారణ పారదర్శకంగా జరగటం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని రసాయన పరిశ్రమల్లో తక్షణమే తనిఖీలు చేపట్టాలని... నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహా ప్రమాదాలపై నిపుణుల కమిటీతో విచారణ చేపట్టాలన్నారు. ప్రమాదాల్లో మృతి చెందినవారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: విశాఖ సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్... ఇద్దరు మృతి