‘‘కరోనా వైరస్‌తో ఇళ్లలో ఉండే (హోం ఐసోలేషన్) వారికి ప్రభుత్వ చికిత్స సరిగా అందడం లేదు. వీరి విషయంలో జిల్లా స్థాయిలో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. పాజిటివ్ వచ్చినట్లు తేలిన అనంతరం ఇళ్లలోనే ఉంటామని బాధితులు చెబితే.. ఆమోదం తెలుపుతూ లిఖితపూర్వకంగా వైద్య సిబ్బంది రాసిచ్చి చేతులు దులుపుకొంటున్నారు. తదుపరి చర్యల గురించి పట్టించుకోవడంలేదు. ఇక మీ పాట్లు మీరు పడండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు’’.
..ఇవి స్వయంగా వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహించిన సర్వేలో కరోనా బాధితులు చెప్పిన మాటలు.
కొవిడ్ సోకి ఇంట్లో ఉండేందుకు అంగీకరించే వారిపై పర్యవేక్షణ పెంచాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని పలుమార్లు వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలిచ్చినా జిల్లాల్లో స్పందన కనిపించడం లేదు. దీనిని గుర్తించిన ఆ శాఖ స్వయంగా ‘ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్’ (ఐవీఆర్‌ఎస్) ద్వారా వైరస్ బాధితుల నుంచి 3 ప్రశ్నలపై అభిప్రాయాలను సేకరించింది. మొత్తం 56,876 అభిప్రాయాలను విశ్లేషించగా.. తొలి ప్రశ్నకు 58% మంది వైద్యులు, ఆరోగ్య సిబ్బంది నుంచి నేరుగా సలహాలు అందడం లేదని, రెండో ప్రశ్నకు 47% మంది ఫోన్ల ద్వారా కూడా సంప్రదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడో ప్రశ్నకు 48% మంది చికిత్స, సలహాలు, సూచనల కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ వివరాలను వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలకు పంపిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
అత్యధికంగా విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో 60% మందికిపైగా అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లాలో 72% మంది తీవ్ర ఆవేదనతో ఉన్నారు.
అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 58% మంది అసంతృప్తి వ్యక్తం చేయగా.. విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో 50%నికి పైగా ప్రతికూలంగా స్పందించారు.
గరిష్ఠంగా ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో 56% మంది చొప్పున ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'రంగులకు కోట్లు ఖర్చు చేశారు... పింఛన్ ఎందుకాపారు?'