Corruption of YCP leaders in Navaratna welfare schemes : నవరత్నాల పేరుతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆ పార్టీ నాయకులే పక్కతోవ పట్టిస్తున్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా 50 శాతం సబ్సిడీతో యంత్ర పరికరాలు అందించి అధిక దిగుబడులు సాధించాలనే సదుద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ యంత్ర సేవా పథకం విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలో అనేక గ్రామాలకు చేరడం లేదు. సబ్సిడీతో వచ్చిన యంత్రాలను మండల స్థాయి నాయకులు ప్రక్కత్రోవ పట్టిస్తున్నారు. స్వార్థ రాజకీయ నాయకుల ఆర్థిక ప్రయోజనాలతో ప్రభుత్వ లక్ష్యం నీరు గారుతోంది.
యంత్రాల పంపిణీ.. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమనాం సచివాలయానికి రెండో విడత జగనన్న వైయస్సార్ యంత్ర సేవా పథకంలో సుమారు పది లక్షల విలువైన ట్రాక్టర్, రోటవేటర్, దుక్కి దున్నే నాగలి సెట్లు 50 శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందజేసింది. ఇటీవల ఆనందపురం మండలం జగన్నాథపురంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు చేతుల మీదుగా రైతులకు సబ్సిడీ యంత్ర పరికరాలు అందజేశారు. భీమునిపట్నం మండలంలో ఉన్న 13 సచివాలయాలలో మొదటి విడత 9 సచివాలయాలకు సబ్సిడీ యంత్ర పరికరాలు అందజేశారు. రెండో విడతలో అమనాం, చిప్పాడ, సింగనబంద, పెదనాగమయ్యపాలెం పంచాయతీలకు 10 లక్షలు విలువైన యంత్ర పరికరాలు అందజేశారు.
ఎంపీపీ అమ్ముకొన్నారని ఆరోపణ.. అమనాం సచివాలయంలో ఉప సర్పంచ్ చుక్క చిట్టిబాబు కన్వీనర్‌గా.. మరో నలుగురు రైతులు సభ్యులుగా ఉన్న పోలమాంబ గ్రూపునకు 10 లక్షల విలువైన ట్రాక్టర్, రోటవేటర్, దుక్కి దున్నే నాగలి సెట్లు సబ్సిడీతో వచ్చినప్పటికీ అవి ఇప్పటికీ రైతులకు చేరలేదు. ఈ సబ్సిడీ యంత్రాలను ప్రారంభంలోనే నారాయణరాజుపేట సర్పంచ్ కు భీమిలి మండల ఎంపీపీ వాసురాజు అమ్మేశారని రైతులు చెబుతున్నారు. కనీసం సచివాలయానికి ట్రాక్టర్ రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ అధికారులతో పాటు మండల, నియోజకవర్గ స్థాయి వ్యవసాయ అధికారులకు ఈ విషయం తెలిసినప్పటికీ... నిమ్మకుండిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన భీమిలి మండల ఎంపీపీ వాసురాజు స్వగ్రామంలోనే రైతుల శ్రేయస్సుకు, సంక్షేమానికి అందజేసిన యంత్ర పరికరాలు ప్రక్కత్రోవ పడుతుంటే... మిగతా సచివాలయాల పరిస్థితి ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
చర్యలు తీసుకోవాలని డిమాండ్... ఇప్పటికైనా అమనాం సచివాలయ అధికారులు స్పందించి సచివాలయానికి సబ్సిడీతో మంజూరు చేసిన వైఎస్ఆర్ యంత్ర పరికరాలను రప్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీంతోపాటు వ్యవసాయ పనులకు ట్రాక్టర్ తో పాటు యంత్ర పరికరాలు ఉపయోగించుకునేందుకు రైతులు చెల్లించాల్సిన ధరలను సచివాలయంలో ప్రదర్శించాలని కోరుతున్నారు. అదేవిధంగా సబ్సిడీ రుణాలతో మంజూరైన వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంలో మంజూరైన ట్రాక్టర్ వేరే సచివాలయానికి అమ్మేసిన, లీజుకిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్యే చీవాట్లు... సబ్సిడీ ట్రాక్టర్, యంత్ర పరికరాలు ప్రక్కత్రోవ పడుతున్నాయనే విషయం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు దృష్టికి వెళ్లడంతో మండల నాయకులకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ నాయకుల ప్రమేయం లేకుండా రైతులకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు, యంత్ర పరికరాలు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.