MUSIC DIRECTOR THAMAN AT VIZAG : కవులు, కళాకారులకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ అని ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఎస్ ఎస్ తమన్ అన్నారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం, సెయింట్ లుక్స్ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆడియో ఇంజినీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ స్టూడియోని ఆయన ఆదివారం ప్రారంభించారు. విశాఖ కేంద్రంగా ఇంతటి భారీ స్టూడియో నిర్మాణం చేయడం అభినందనీయమని తమన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రఖ్యాత కవులు, నటులు, సంగీత కళాకారులకు జన్మస్థలమన్నారు. ఇక్కడి భాష, యాస తనకు ఎంతో స్ఫూర్తిని అందిస్తాయని తమన్ కొనియాడారు. తన విశ్రాంత జీవితాన్ని విశాఖ నగరంలో గడపడానికి ఇష్టపడతానని తమన్ స్పష్టం చేశారు.
"ఆంధ్రా అంటేనే సంగీతానికి పేరు. ఎందరో ప్రఖ్యాత కవులు, నటులు, సంగీతకారులు ఇక్కడ జన్మించారు.ఇక్కడి భాష, యాస తనకు నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. మేము పాటలు కంపోజ్ చేసే ముందు ఏమైనా యాస కావాలంటే ముందుగా శ్రీకాకుళం, విశాఖ గుర్తుకువస్తాయి. వైజాగ్‌లో ఇలాంటి స్టూడియోను పెట్టడానికి కృషి చేసిన ప్రభుత్వానికి, ఏయూ వైస్ ఛాన్సలర్‌కి నా అభినందనలు. నా విశ్రాంత జీవితాన్ని విశాఖలో గడపాలనుంది. అలాగే భీమిలిలో సొంతంగా ఓ స్టూడియో నిర్మించాలని అనుకుంటున్నా "-తమన్, సంగీత దర్శకుడు
తనకు భీమిలిలో మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉందని ఆయన తెలిపారు. మనస్సు బాధ కలిగితే సంగీతంతోనే అది తీరిపోతుందని తమన్ అన్నారు. సంగీత కళాకారులకు సంగీతంతోనే ఒత్తిడి దూరం అవుతుందని చెప్పారు. విద్యార్థుల కోరిక మేరకు 'నిన్నిలా.. నిన్నిలా చూశానే' పాట పాడి వినిపించారు. వీసీ ఆచార్య పీవీజీడీ.ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. తొలి దశలో రూ.3.5 కోట్లు వెచ్చించి రికార్డింగ్ స్టూడియో, ప్రాక్టికల్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని.. విద్యార్థులు సంగీత రంగంలో రాణించడానికి అవసరమైన అన్ని కోర్సులను అందిస్తామన్నారు. అన్ని విభాగాల విద్యార్థులు ఈ కోర్సులను చేసే విధంగా అవకాశం కల్పిస్తామన్నారు. త్వరలోనే ఏయూ ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఏయూ తరఫున తమన్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య సరస్వతి విద్యార్ధి, జేమ్స్ స్టీఫెన్, టి. షారోన్ రాజు, ఎ.కె. ఎం. పవార్, సెయింట్ లూక్స్ సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. జనవరిలో నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి, తమిళ హీరో విజయ్ నటించిన వారుసుడు సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందిన తమన్.. తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ RC15 సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఓ పాటను కంపోజ్ చేశారు.
ఇవీ చదవండి: