కరోనా తరువాత ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పర్యాటకరంగ పురోగతికి కార్యాచరణ ప్రణాళిక చేయాలని పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఏ జిల్లాలో ఏం చేయొచ్చు, ఏరకమైన వసతులు కల్పించాలి, పర్యాటకులను ఏవిధంగా ఆకర్షించాలి వంటి ఇతర ఏర్పాట్లపై నివేదిక తయారు చేసి వారం రోజుల్లోగా సమర్పించాలన్నారు. నూతన పర్యాటక విధానం రావడం వల్ల పెట్టుబడిదారులతో ఈ నెల 20న ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్ట్స్ ఈడీ సత్యనారాయణతో కలిసి మూడు జిల్లాలకు చెందిన అధికారులు, ఇంజినీర్లతో సమావేశమయ్యారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యాటకులకు అవసరమైన మౌలికవసతులు కల్పించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో అరసవిల్లి, శ్రీకూర్మం వంటి పుణ్యక్షేత్రాలను కలుపుకొని ప్యాకేజీలు రూపొందించి తగిన ప్రచారం చేయాలన్నారు.
విశాఖలోని రామకృష్ణాబీచ్‌లో జీవీఎంసీ అధికారులతో కలిసి పర్యాటక సమాచార కేంద్రాన్ని సత్వరమే ఏర్పాటు చేయాలన్నారు. వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ, జిల్లా పరిషత్తు అధికారులు సంయుక్తంగా ప్రతివారం ప్రజలను ఉత్సాహపరిచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పర్యాటక హోటళ్లపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డీ రామ్‌ప్రసాద్, డీవీఎం ప్రసాదరెడ్డి, ఈఈ రమణ తదితరులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
సమావేశం అనంతరం ప్రాజెక్ట్స్ ఈడీ సత్యనారాయణ జిల్లా అధికారులతో కలిసి నగరంలోని పర్యాటక శాఖకు ఉన్న స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొట్లకొండ, కంటైనర్ హోటల్, రుషికొండ పరిసర ప్రాంతాల్లోని స్థలాలను చూశారు. అనంతరం తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ నౌక ఎంవీ మాను పరిశీలించి పర్యాటక ప్రాజెక్టుగా అది ఎంతవరకు ఉపయోగపడనుందో చర్చించినట్లు సమాచారం.
ఇదీ చూడండి: