వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు విశాఖ జిల్లాను ముంచెత్తాయి. వరద నీరు చేరి శారద, తాండవ నదులు పొంగి ప్రవహించాయి. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చాలా గ్రామాల్లో పొలాలు ముంపునకు గురయ్యాయి.
పర్యటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ బి.వి సత్యవతి, ఎలమంచిలి ఎమ్మెల్యే యు.వి కన్నబాబు... రాజులు రాంబిల్లి, అచ్యుతాపురం గ్రామాల్లో పర్యటించారు. రైతులను కలిసి పంట నష్టాన్ని తెలుసుకున్నారు. ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ముత్తంశెట్టి రైతులకు భరోసా ఇచ్చారు.
ముంపునకు గురైన 7 గ్రామాల ప్రజలను ఆదుకుంటామని, పునరావాసం కల్పిస్తామని మంత్రి తెలిపారు. పంట నష్టంపై అధికారులు నివేదికలు సమర్పించిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. పొలాల ముంపునకు శారదా నదిపై నిర్మించిన వంతెన ఒక కారణమని రైతులు చెబుతున్నారని, నేవీ అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కాలువలకు ఏర్పడిన గండ్ల పూడ్చివేతకు చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా శాశ్వత ప్రాతిపదికన కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:
ఎస్‌ఎస్‌సీలో ప్రతిపక్ష నేత పేరు లేకపోవడం సుప్రీం తీర్పునకు విరుద్ధం: హైకోర్టు