విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయవద్దంటూ వామపక్షాలు, పలు సంఘాల ఆధ్వర్యంలో శనివారం విశాఖపట్నం మద్దిలపాలెం కూడలిలో జరిగిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. సీపీఐ, సీపీఎం, మహిళా సమాఖ్య, పీవోడబ్ల్యూ, ఐద్వా సంఘాలు కలిసి ఉదయం 11 గంటల ప్రాంతంలో మద్దిలపాలెం కూడలికి చేరుకున్నాయి.
మానవహారం, నిరసనకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుత నిరసనను అడ్డుకోవడం ఏంటని వారు ఏసీపీ మూర్తిని ప్రశ్నించారు. కూడలికి అటు.. ఇటు పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. దాంతో పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించబోగా.. కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ బి.గంగరావు, ఎం.పైడిరాజు, జి.వామనమూర్తి తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తే పాలకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెదేపా విశాఖ లోక్‌సభ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. శనివారం పెదగంట్యాడ కూడలిలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు.
ఇదీ చూడండి. 'ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని కేంద్రం విరమించుకోవాలి'