మిషన్ బిల్డ్ ఏపీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం.. పెద్దఎత్తున ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటని వామపక్షాలు విమర్శించాయి. విశాఖ బీచ్ రోడ్‌లోని 13.59 ఎకరాలతో పాటు మొత్తం పద్దెనిమిది ఆస్తులు విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఏపీఐఐసీ భూముల వద్ద ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపాయి.
తెదేపా ప్రభుత్వ హయాంలో లులూ సంస్థకు ఇదే స్థలాన్ని అప్పగించాలనుకున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ వ్యతిరేకించిన విషయం గుర్తు చేశారు. అంతేకాక.. తాను అధికారంలోకి వస్తే.. ఆ స్థలాన్ని ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తామని వాగ్ధానం చేశారన్నారు. ఇప్పుడు ఆ భూముల అమ్మకానికి సిద్ధపడటం సరైందికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'విలువైన భూములను ఇష్టారాజ్యంగా అమ్మేస్తుంటే చూస్తూ ఊరుకోం'
ఐదేళ్లు ప్రజాపాలన చేయాల్సిన ప్రభుత్వం సహజ వనరైన భూమిని అమ్మటం సరైంది కాదని సీపీఎం నగర కార్యదర్శి డా. బి. గంగారావు అన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఖరీదైన స్థలాలను వేలానికి పెట్టటం అనేది.. విశాఖ అభివృద్ధిని దెబ్బతీసే చర్య అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని.. లేకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: విశాఖ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం సమీక్ష