రామతీర్థం ఘటనలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని క్షత్రియ సేవా సమితి ఖండించింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి సభ్యులు మాట్లాడారు. అశోక్ గజపతిరాజుకు వెల్లంపల్లి శ్రీనివాస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి చేసిన అనాలోచిత చర్యలు, అనుచిత వ్యాఖ్యలు యావత్ క్షత్రియ జాతిని ఆగ్రహానికి గురిచేశాయని సమితి అధ్యక్ష, కార్యదర్శులు అన్నారు.
విలువలకు నిలువుటద్దంగా ఉండే అశోకగజపతిరాజుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆవేదనకు గురిచేశాయన్నారు. ఇటువంటి అవమానకర పరిస్థితులు పునరావృతం కాకుండా.. మంత్రిపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అశోకగజపతి రాజును గౌరవించుకోవడం అంటే మావనతా విలువలను గౌరవించుకోవడమేనని సమితి నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు శ్రీ మనోహర రాజు, వేగేశ్న వెంకటేశ్వర రాజు, ఉపకార్యదర్శులు వేగేశ్న పెద్దిరాజు, నడింపల్లి నానిరాజు, కోశాధికారి పెన్మత్స వెంకటేశ్వర రాజు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొని తమ నిరసన తెలిపారు.
ఇదీ చదవండి: రామతీర్థానికి నేను వెళ్తే తప్పేంటి?: సోము వీర్రాజు