సర్కార్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పేరుతో ఏడు రకాల సామగ్రి కిట్లను అందజేయడానికి విశాఖ జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. కొన్నాళ్లుగా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ కార్యక్రమాన్ని నేడు నుంచి లాంఛనంగా ప్రారంభించాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. ఈ మేరకు విశాఖ జిల్లాకు సంబంధించి 3లక్షల 17 వేల 202 మంది విద్యార్థులకు కిట్లను సిద్ధం చేశారు.
వీటిలో ఏకరూప దుస్తులు , బెల్టులు, సాక్సులు, పుస్తకాలు, బూట్లు.. పది శాతం చొప్పున ఇంకా జిల్లాకు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే వచ్చిన వాటిని ముందుగా విద్యా ర్థులకు అందజేసి రాని వాటిని నమోదు చేసుకుని తర్వాత అందజేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ప్రత్యేకంగా ఓ యాప్ తయారు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బయోమెట్రిక్ తీసుకొని కిట్లు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
కరోనా నేపథ్యంలో రోజుకి 50 మంది విద్యార్థులకు మాత్రమే వీటిని అందించనున్నారు. పుస్తకాలను ఆరు నుంచి పది తరగతుల విద్యార్థులకు మాత్రమే అందజేస్తారు. కొన్ని పుస్తకాలు అందజేసి మిగతా వాటిని పాఠశాలలు ప్రారంభించిన తర్వాత ఇవ్వనున్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల జలవివాదం: క్రియాశీలకం కానున్న కృష్ణాబోర్డు