Defence Exhibition : రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు ఎంస్ఎంఈలపై దృష్టిపెట్టింది భారత ప్రభుత్వం. దీన్ని అవకాశంగా తీసుకుని తమ సాంకేతిక ఆవిష్కరణలను రక్షణ రంగానికి అందించాలని చూస్తున్నాయి వివిధ అంకుర సంస్థలు. ఇందుకు... విశాఖలోని నేవల్ డాక్ యార్డ్ స్వర్ణోత్సవాలను వేదికగా చేసుకుని తమ ఆలోచనలను వివరించాయి. ఈ ప్రదర్శనలో యువత ఆలోచనలు రానున్న సాంకేతిక అభివృద్ధిని కళ్లకు కట్టాయి.
ఆత్మ నిర్భర భారత్ పేరిట ప్రభుత్వం అందిస్తున్న అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా పరిశోధనలపై ఆసక్తి ఉన్న యువత స్థాపించిన చిన్న అంకురాలు తమ సాంకేతిక సత్తాను చాటేందుకు బలంగా ప్రయత్నిస్తున్నాయి. యువ ఇంజనీర్లు, మేథస్సుకు పదును పెట్టి సైన్యం అవసరాలకు అనుగుణంగా వివిధ పరికరాలు, సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారు.
దేశీయ యువతరానికి తమ ముందున్న అవకాశాల్ని వివరిస్తూ వారి ఆలోచనలు తెలుసుకునేందుకు విశాఖ డాక్ యార్డు స్వర్ణోత్సవాల సందర్భంగా టెక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీనికి రక్షణ రంగ ప్రముఖులు, నిపుణులు హాజరయ్యారు. ఇందులో పెద్ద పెద్ద సంస్థల నుంచి చిన్నచిన్న అంకురాల వరకు తమ ఆవిష్కరణల పనితీరును వివరించారు.
ఎల్&టి సంస్థ ప్రదర్శించిన 3డీ- హ్యాండీ స్కానింగ్ మెషీన్ ఆకట్టుకుంది. ఇప్పటికే...ఈ సాంకేతికతను సావిత్రి, సహ్యాద్రి వంటి యుద్ధ నౌకల్లో వినియోగించారు. ఈ మెషీన్ సాయంతో తాకకుండానే ఒక మెటీరియల్ స్కాన్ చేసి అందులో వినియోగించిన లోహం, దాని మోతాదులను తెలుసుకోవచ్చు.
" ఇదే పీఎమ్‌ఐ పరికరం. దీని ద్వారా మనం ఎంచుకున్న వస్తువు ఏ పదార్థంతో తయారు చేశారో తెలుసుకోవచ్చు. దీన్ని వినియోగించినప్పుడు... ఎక్స్‌రే కిరణాలు వెళ్లి ఆ వస్తువుపై పడతాయి. ఇప్పుడు నేను ఈ మెటీరియల్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టి పరీక్షించాలి..... ఇది అల్యూమినియం ప్లేట్. " -హరీష్, ఎల్ అండ్ టీ ప్రతినిధి
రేంజ్ ఏరో అనే అంకుర సంస్థ తయారు చేసిన ఈ డ్రోన్ సైనికులకు అవసరమైన సరకుల్ని రవాణా చేసేందుకు రూపొందించారు. దాదాపు 100కేజీల బరువు మోయగల ఈ డ్రోన్.. 3 గంటల పాటు గాలిలో నిరంతరాయంగా ఎగురుతుంది. కదులుతున్న ఒక యుద్ధ నౌక నుంచి మరో నౌకపైకి వెళ్లేందుకు మల్టీ రోటర్లతో పనిచేసేలా తయారు చేశారు. దీని పనితీరు... నేవీ అధికారుల దృష్టిని ఆకర్షించింది.
" ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్రోన్లు మోస్తున్న బరువులతో పోల్చితే ఎక్కువ బరువుల్ని మోసే సామర్థ్యంతో దీన్ని తయారు చేశాం. దీని ద్వారా 5, 10, 100 కేజీల పేలోడ్‌ను కూడా సరఫరా చేయొచ్చు. దీని డిజైన్, రూపకల్పన అంతా బెంగళూరులోనే జరిగింది. దీన్ని ఇంకా ఎక్కడా వినియోగించలేదు... రక్షణ బలగాలతో కలిసి దీని సామర్థ్యాన్ని మదింపు చేయాలనుకుంటున్నాం." -రోహిత్, రేంజ్ ఏరో సంస్థ, బెంగళూరు.
" గత దశాబ్ద కాలంగా భారత నేవీ కోసం స్వదేశీ పరికరాలు రూపొందిస్తున్నాం. వివిధ అప్లికేషన్, పరికరాల రూపంలో వెన్నుదన్నుగా నిలుస్తున్నాం. ప్రభుత్వాలు సహకరిస్తే రష్యన్ ఉత్పత్తలను దేశీయ పరికరాలతో భర్తీ చేసే సామర్థ్యం మనకు ఉంది. అందుకు ఆత్మనిర్భర్ భారత్‌ను స్ఫూర్తిగా తీసుకుని స్వదేశీయ ఉత్పత్తుల కోసం నేవీతో కలిసి పనిచేస్తాం. మనం దేశీయ సంస్థలకు అవకాశాలు కల్పిస్తే సమయం, ఖర్చు వంటి విషయాల్లో చాలా కలిసి వస్తుంది." -ప్రశాంత్ నాయక్, సన్ లక్స్ కంపెనీ, బెంగళూరు
బెంగళూరుకు చెందిన నోపో నానో టెక్నాలజీ అంకుర సంస్థ...యుద్ధ నౌకల్లో నెలల తరబడి ఉండే సైనికుల కోసం ఓ ఆవిష్కరణ చేసింది. ఈ సాంకేతికత ద్వారా...ఉప్పు నీరు, ఆయిల్ స్పిల్ నుంచి శుద్ధ, కర్బన రహిత జలాలను తీసుకునేందుకు వీలవనుంది.
" భారత నేవీ కోసం నీటిని వడకట్టే పొరను తయారు చేశాం. దీని ద్వారా ఉప్పు నీటిని, నూనె నీటిని శుద్ధి చేసేందుకు వీలవుతుంది. ఈ నీటి పొర ఇలా కనిపిస్తుంది. దీన్ని థిన్ సైట్ కాంపోసైట్ సిస్టమ్‌గా పిలుస్తారు. దీనిలో నానో ట్యూబ్‌లు అమర్చి...నీటిని వేగంగా పంపిస్తే... ఉప్పు, నూనెలను తొలగిస్తుంది." -యాంటోగాడ్వి, సీఈఓ, నోపో నానో టెక్నాలజీ
కొవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో... అవతార్ యేవియేషన్ సంస్థ పోర్టబుల్ ఆక్సిజెన్ కాన్సట్రేటర్లు, ఇన్సిరేటర్‌లకు రూపకల్పన చేసింది. రక్షణ రంగంలో నిర్మించే భారీ యంత్రాలు, పరికరాల రూపకల్పనలో లోపాల్ని సరిదిద్దేందుకు...2డి, 3డి సాంకేతికత ఉపకరిస్తుంది. ఇదే అంశంపై పని చేసిన... థింక్ త్రీడి అనే సంస్థ సరికొత్త పరిష్కారంతో ముందుకు వచ్చింది.
" ఇది దేశీయంగా రూపొందించిన ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్. క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసుకున్న ఈ పరికరంతో స్మార్ట్ మానిటరింగ్, రియల్ టైమ్ ఆక్సీజన్ స్థాయిలు తెలుసుకోవచ్చు. మీరు ఆక్సీ మీటర్‌ను పెట్టుకుని చూస్తే.... రక్తంలోని ఆక్సీజన్ స్థాయికి తగినట్లు ఆక్సీజన్‌ను సరఫరా చేస్తుంది. దీన్ని రక్షణ రంగానికి అనుకూలంగా... ఇలా పోర్టబుల్ ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్‌తో ముందుకు వచ్చాం. యుద్ధ క్షేత్రంలో గాయపడ్డ సైనికుడికి ఇది 3 గంటల పాటు ప్రాణవాయువు అందించగలదు. బ్యాటరీతో పని చేసే ఇది.... క్లిష్ణ సమయాల్లో సైనికుల ప్రాణాలు కాపాడుతుంది." -యువరాజ్, అవతార్ యేవియేషన్ సంస్థ అధినేత.
" మీరేదైన నమూనా రూపొందించాలి అనుకుంటే... వాటి 2డీ, 3డీ నమూనాలు అందించాల్సి ఉంటుంది. లేదా ఫిజికల్ కాంపోనెంట్‌ను నేరుగా స్కానింగ్ తీసుకుని... వాటి ఆధారంగా దేన్నైనా 3డీ ప్రింటింగ్ చేయొచ్చు. మనం వాడే మెటీరియల్స్‌ను బట్టి 10 రకాల సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయి. ఏ తీరుగానైనా నమూనాలు రూపొందించలేని సంక్లిష్ట లక్షణాల్ని చొప్పించి... నమూనాలు తయారు చేసేందుకు ఈ సాంకేతికత ఎంతో ఉపయోగకరం." -రాజేష్, థింక్ త్రీడి ప్రతినిధి
దేశీయావసరాలకు అనుగుణంగా.. యువత ప్రదర్శించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. దీని ద్వారా దేశీయంగా పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి కల్పన సహా...ఆత్మనిర్భరత, మేకిన్ ఇండియా లక్ష్యాలను చేరుకోగలమని యువత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది.
ఇదీ చదవండి : CJI NV Ramana: తెలుగుజాతి ఔన్నత్యం మరింత పెంచాలి - సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ