ఉత్తరాంధ్ర వాసులకే కాకుండా.. ఒడిశా, ఛత్తీస్గడ్ వారికి సమీపంలో ఉండే మెడికల్ హబ్ విశాఖ. ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను కార్పోరేట్‌తో సమానంగా తీర్చి దిద్దేందుకు యత్నాలు నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి. నవరత్నాలులో భాగంగా ప్రభుత్వ బోధనాసుపత్రులలో మౌలిక సదుపాయాలను మరింతగా పెంచే విధంగా ప్రణాళికలు సిద్దం చేయనున్నారు. విశాఖలోని కేజీహెచ్ 900 కోట్ల రూపాయిలతో వివిధ ఆభివృద్ది పనులు చేయాలని తలపెడుతున్నారు. దీనికి డీపీఆర్ తయారుచేసే బాధ్యతను దిల్లీలోని అర్క్ ఎన్ డిజైన్ సంస్ధకు అప్పగించారు. 3కోట్ల 87 లక్షల రూపాయిలను దీనికోసం ప్రభుత్వం చెల్లిస్తుంది.
విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) లో 478 కోట్ల రూపాయిల అభివృద్ది పనుల డీపీఆర్ తయారు చేసే బాధ్యతను హైదరాబాద్‌కి చెందిన కాంటినెంటల్ డిజైనర్‌కి అప్పగించారు. ఇందు కోసం రెండు కోట్ల 82 లక్షల రూపాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. ఇవి కాకుండా ప్రభుత్వ కంటి ఆసుపత్రి, ఛాతీ ఆసుపత్రి, రాణిచంద్రమణిదేవి ఎముకల ఆసుపత్రి, మానసిక వైద్యాలయం, విక్టోరియా ఆసుపత్రులను 195.79 కోట్ల రూపాయిలతో అభివృద్ది పనులు చేపడతారు. దీని డీపీఆర్ తయారు చేసే బాధ్యతను
హైదరాబాద్‌కి చెందిన భార్గవ్ బిల్డింగ్ టెక్నాలజీ సంస్ధకు అప్పగించారు. కోటి 59 లక్షల రూపాయిలను ఈ డీపీఆర్ రూపకల్పన కోసం చెల్లించనున్నారు.
మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులను రూ. 1500 కోట్లకుపైగా ఖర్చుతో మౌలిక సదుపాయాల కల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్న భవనాలను ఆధునీకరించడం, ఆదనపు భవనాల నిర్మాణం వంటివి అన్నీ ఇందులో ఉంటాయి.
ఇదీ చదవండి: రష్యాలో రాజ్‌నాథ్‌తో చైనా రక్షణ మంత్రి భేటీ!