వద్దన్నా వెళ్లాడు..
‘బక్రీద్ పండగ.. ఈరోజు పనికి పోవద్దు.. ఇంటిలోనే ఉండు నాయనా..’ అని చిన్నాన్న చెప్పినా చైతన్య వినలేదు. ‘రాఖీ రోజు సెలవు పెడతాను. అక్కకి ఉంగరం కొనాలి. ఈరోజు పనికి పోతున్నా..’నని చెప్పి వెళ్లాడు. ప్రమాద ఘటనను తెలుసుకున్న బాబాయ్ జగన్‌మోహన్‌రావు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో ఉంటే ప్రాణాలు దక్కేవంటూ విలపించారు. ఆరేళ్ల వయసులోనే తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో చైతన్యను, అతడి తోబుట్టువులను జగన్‌మోహన్‌రావే పెంచి చదివించారు. ఐదేళ్లుగా చైతన్య షిప్‌యార్డులో పనికి వెళ్తున్నాడు.
మాకు దిక్కెవరు?
గాజువాక సమీపంలోని నక్కవానిపాలెంలో ఉంటున్న వెంకటరమణ మృతితో భార్య సత్యవెంకట నాగవాణి ‘ఇక మాకు దిక్కెవరు’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. వీరికి ఇద్దరు చిన్న పిల్లలు. రమణ గత 14 ఏళ్లుగా షిప్‌యార్డులో పనిచేస్తున్నారు.
రోడ్డున పడ్డ కుటుంబం
తండ్రి వారసత్వంగా షిప్‌యార్డులో సత్తిరాజు (51)కు ఉద్యోగం వచ్చింది. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు. మల్కాపురంలో నివాసం ఉంటున్నారు. కొందరు కుటుంబసభ్యులు శవాగారం వద్దకు వెళ్లగా భార్య, పిల్లలు ఇంటి వద్దే విషణ్ణవదనంతో తమకు దిక్కెవరని రోదించారు.
నాగదేవులు కుటుంబీకుల కన్నీరు
అనకాపల్లి మండలం కూండ్రం గ్రామానికి చెందిన పల్లా నాగదేవులు (35) బంధువుల ఇంట్లో ఉంటూ లీడ్ ఇంజినీర్స్ ఒప్పంద కార్మికునిగా పనిచేసేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రోజూ ఉదయం 7 గంటలకు వెళ్లి సాయంత్రం వచ్చేవాడని, ప్రమాదంలో చిక్కుకొని మృతి చెందాడని కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదే ప్రమాదంలో మృతి చెందిన మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామానికి చెందిన ఎంఎన్ వెంకటరావుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వర్క్‌మేన్‌గా పనిచేస్తున్న జి.జగన్‌మోహన్‌రావు కుటుంబీకులు సింధియాలో నివాసం ఉంటున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మల్కాపురం సమీపంలోని షిప్‌యార్డు కాలనీలో నివాసం ఉంటున్న పి.భాస్కర్రావు ప్రమాదంలో కన్నుమూశారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
గ్రీన్‌ఫీల్డు సంస్థలో ఒప్పంద కార్మికుడైన పి.శివ (35) గోపాలపట్నం దరి బుచ్చిరాజుపాలెంలో కుటుంబంతో నివాసం ఉండేవాడు. ఇతడికి భార్య సుమ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాద ఘటనను తెలుసుకున్న భార్య, కుటుంబీకులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చిన్నప్పటి నుంచి చలాకీగా ఉండే తమ్ముడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో అన్న, కుటుంబీకులు గుండెలవిలసేలా రోదించారు.
భోజన విరామమే కాపాడింది
ప్రమాదం జరిగిన సమయంలో పలువురు అంతకు కొద్దిసేపు ముందే అక్కడి నుంచి వెళ్లటంతో పెనుముప్పు తప్పింది. క్రేన్ టెస్టింగ్ పనుల సమయంలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల వారు పాల్గొన్నారు. అక్కడ సుమారు 300 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. 11.30 గంటలకు వారికి భోజన విరామం కావడంతో పలువురు బయటకు వచ్చేశారు. ఎలక్ట్రికల్ పని చేస్తున్న కొందరు క్రేన్‌పైనే ఉన్నారు. క్రేన్ కుప్పకూలుతున్నప్పుడు సివిల్ పనుల నుంచి బయటకొచ్చిన వారంతా గమనించి దూరంగా పరుగులు తీశారు. కుప్పకూలిన క్రేను మరో మీటరు ముందుకెళ్తే మరో క్రేనుపై పడేది. అక్కడ సుమారు 50 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. కాగా.. మృతదేహాలకు ఆదివారం కొవిడ్ పరీక్షలు చేశాక వాటిని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వానికి కలెక్టర్ వినయ్‌చంద్ నివేదిక పంపారు. మృతుల్లో 10 మందిని గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది.
అభివృద్ధి మాటున సీఎం జగన్ విశాఖ ప్రజల గొంతు కోస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు విమర్శించారు. రాజధాని పేరుతో విశాఖకు మరణశాసనం లిఖిస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: విశాఖ హెచ్ఎస్ఎల్లో ఘోర ప్రమాదం...11 మంది మృతి