కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే జీవితాలను నాశనం చేస్తుంటే... అండగా మేమున్నామంటూ నటిస్తూ బాలికల జీవితాల్లో అంధకారం నింపితే... అభంశుభం తెలియని పసిమొగ్గలపై రాక్షసంగా వ్యవహరిస్తే... ఆ బాలికలకు దిక్కెవరు? తమ గోడు చెప్పుకున్నా... కన్నీరు కార్చినా జీవితాంతం వెంటాడే దారుణాన్ని మరచిపోయేదెలా? ...ఇలాంటి వేదనాభరితుల సంఖ్య ఏటేటా పెరుగుతుండటం కలవరపరిచే అంశమే.
విశాఖ నగరంలో బాలికలపై జరిగిన లైంగిక దాడులను విశ్లేషిస్తే...ఎక్కువగా తెలిసిన వారే నిందితులుగా తేలుతోంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ముందుకు సాగే వారి కలలను తుంచేస్తూ ...చిన్నారుల భావి జీవితాన్ని నేరగాళ్లు అంధకారంలోకి నెట్టేస్తున్నారు.
స్నేహం తెచ్చిన చేటు..
నాలుగు నెలల నాటి ఘటనిది. నగర శివారు ప్రాంతానికి చెందిన 14 సంవత్సరాల వయసున్న ఇద్దరు బాలికలు తమకంటే పదేళ్ల పెద్దవయసు వారితో స్నేహం చేశారు. అదే వారి పాలిట శాపంగా మారింది. బీచ్‌కు వెళ్లిన తరువాత ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంకో బాలికపై మరో యువకుడు లైంగిక వేధింపులకు దిగాడు. ఇంటికి వచ్చిన తరువాత బాలికల పరిస్థితి గుర్తించి ఆరా తీయగా విషయం బయటపడింది. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు.
బాగోగులు చూస్తామని .. వ్యభిచార కూపంలోకి దించి
తల్లిదండ్రులు లేని ఓ బాలిక(17) బాగోగులు చూస్తామని తీసుకెళ్లిన మేనమామ, మేనత్త కొన్ని రోజుల తరువాత... బాలికను మళ్లీ అమ్మమ్మ ఇంటి వద్ద వదిలి వెళ్లారు. కొద్ది రోజుల తరువాత బాలిక గర్భిణి అని తేలింది. బాలికతో మేనత్తే వ్యభిచారం చేయించినట్లు తెలిసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఆపదలో... అండగా...
ఛైల్డ్‌లైన్ నెంబరు: 1098
పోలీసులకు సమాచారం ఇవ్వాలంటే: 100
మహిళా సమస్యలపై ఫిర్యాదు చేయాల్సిన వాట్సప్ నెంబరు: 9121211100
పోలీసు వాట్సప్ నెంబరు: 9493336633
అమ్మో... సవాళ్లు ఎన్నో
* డిజిటల్ ఉపకరణాల వినియోగం పెరిగిన తరువాత అనుకోకుండా చూసే అవాంచిత దృశ్యాలతో పలువురు గాడితప్పుతున్నారు. ఇది పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. పోలీసుల దర్యాప్తుల్లో, బాలల సంక్షేమ మండలి ప్రతినిధుల అధ్యయనంలో వెలుగు చూసిన వాస్తవమిది.
* తల్లిదండ్రులు తమ పిల్లలకు డిజిటల్ ఉపకరణాలు ఇస్తున్నప్పటికీ వారు వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటున్నారా? లేదా? అన్న విషయాలపై ఏమాత్రం దృష్టిపెట్టకపోవడమూ ప్రమాదాలకు దారి తీస్తున్నట్లు చెబుతున్నారు.
* ప్రేమ, స్నేహం పేరుతో బాలికలను నమ్మించి అక్రమ రవాణా చేసే ముఠాలకు అమ్మే ఘటనలూ కలవరపరుస్తున్నాయి.
బయటపడే మార్గాలేమిటంటే...
* పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొందరు రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులు కూడా వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నారు. అలాంటి వారి బారిన పడకుండా కూడా తల్లే చొరవ తీసుకుని పిల్లలకు ఆయా అంశాలపై అవగాహన కల్పించాలి.
* బాలికలపై ప్రేమ, అభిమానం, ఆత్మీయత ఉన్నట్లు నటిస్తూ అవసరం ఉన్నా... లేకపోయినా కొందరు తాకుతూ ఉంటారు. అవాంఛిత స్పర్శలను గుర్తించేలా.. అప్రమత్తం చేయాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు తీసుకొని వారిని చైతన్య పరచాలి.
* ఒంటరిగా బయటకు వెళ్లినప్పుడు సహాయ కేంద్రాల ఫోన్ నంబర్లు తెలుసుకోవడం ఉత్తమం.
" పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడకూడదు. ఇటీవలి కాలంలో డిజిటల్ ఉపకరణాలు, అంతర్జాలం ఉపయోగించడం అనివార్యంగా మారింది. పిల్లలు అవాంఛిత, అశ్లీల అంతర్జాల చిరునామాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫలితంగా కొత్త అలవాట్లకు బానిసలుగా మారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకునే దారులను మూసివేయవచ్ఛు పిల్లలపై నిఘా ఉంచడం అంటే వారి స్వేచ్ఛను హరించడం కాదన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి." -ఆర్.శ్యామలారాణి, ఛైర్‌పర్సన్, బాలల సంక్షేమ మండలి.
"ప్రాథమిక దశలోనే ముందుకు రావాలి: మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యధిక నేరాల్లో వారికి తెలిసిన వారే నిందితులుగా ఉంటున్నారు. వారితో సమస్యలు ప్రారంభమైన వెంటనే పోలీసుల్ని ఆశ్రయిస్తే తగిన కౌన్సెలింగ్ చేసి ప్రాథమిక దశలోనే సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాం. చాలామంది పోలీసు స్టేషన్‌కు రావడానికి సందేహిస్తారు. ఫలితంగా ఆయా సమస్యలు కాస్తా పెద్దవై తీవ్ర ఇబ్బందులకు కారణమవుతున్నాయి." - ప్రేమ్‌కాజల్, ఏసీపీ, దిశా పోలీసుస్టేషన్, ఎండాడ.
"దిశ’ స్టేషన్ పోలీసులను ఆశ్రయించొచ్చు: మహిళలు, యువతులు, బాలికలు ఎండాడలోని ‘దిశ పోలీసు స్టేషన్’ను ఆశ్రయించవచ్ఛు అక్కడ మహిళా పోలీసు అధికారులు నేర స్వభావాన్ని బట్టి తగిన చర్యలు తీసుకుంటారు. మహిళల సమస్యలపై విస్తృత అవగాహన ఉన్న అధికారులు, ఉద్యోగులను నియమించాం. వారి సేవల్ని బాధితులు వినియోగించుకోవాలి." - మనీశ్‌కుమార్ సిన్హా, విశాఖ నగర పోలీసు కమిషనర్.
ఇదీ చదవండి: పేకాట స్థావరాలపై దాడి.. 65 మంది అరెస్ట్