Expert Committee Report on Rushikonda: రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు నియమించిన కమిటీ తన నివేదికను కోర్టుకు సమర్పించింది. అక్రమంగా తవ్వకాలు, భవనాలు నిర్మించారని కోర్టుకు వెల్లడించింది. అనుమతికి మించి కట్టడాలున్నాయని.. నియామక కమిటీ వెల్లడించింది. మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అటవీ, పర్యావరణశాఖకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణాలపై తీసుకున్న చర్యలపై 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసు విచారణను హైకోర్టు నవంబర్ 29కి వాయిదా వేసింది.
కేంద్ర ప్రభుత్వాధికారులతో విచారణ: రుషికొండ అక్రమ తవ్వకాలపై నిజాలను నిగ్గుతేల్చేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల అధికారులతో... కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఎంవోఈఎఫ్ (MOEFCC) కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వీవీఎస్ఎన్ శర్మ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి చెందిన శాస్త్రవేత్త డి.సౌమ్య... నేషనల్ సెంటర్ ఫర్ సస్టైయినబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ శాస్త్రవేత్త డాక్టర్ మానిక్ మహాపాత్ర, కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కార్యనిర్వహణ ఇంజనీర్ తదితరులు ఉన్నారు. నీరు ఇప్పటికే విశాఖలోని రుషికొండ వివరాలను మెమో రూపంలో కోర్టు ముందు ఉంచారు.
AP HIGH COURT: రిషి కొండపై.. "వుడా" మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి: హైకోర్టు
ఇప్పటికే రుషికొండపై సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణం..!: రుషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణంపై జరుగుతుందంటూ... లింగమనేని శివరామ్ ప్రసాద్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మించారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్‌పై ఎన్‌జీటీలో విచారణ జరుగుతున్నప్పటికీ.. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా... రుషికొండలో నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం ఉల్లంఘించారని శివరామ్ పిటిషన్‌లో తెలిపారు. రుషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసేలా జారీ చేసిన జీవోను రద్దు చేయాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. రుషికొండపై రిసార్ట్ నిర్మాణంపై దాఖలైన కేసులు పరిష్కారం అయ్యే వరకూ... రుషికొండపై నిర్మాణాలు జరగకుండా ఉత్తర్వులు ఇవ్వాలని శివరామ్ ప్రసాద్ కోర్టును కోరారు.
విశాఖ నుంచి పాలన సాగిస్తానంటున్న జగన్: డిసెంబర్ నుంచి తాను విశాఖ నుంచి పరిపాలన కొనసాగించనున్నట్లు ఇప్పటికే సీఎం జగన్ వెల్లడించారు. ఈ మేరకూ... ఏపీ ప్రభుత్వం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతిపై కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రుషికొండపై పర్యాటక శాఖ పేరుతో నిర్మించిన భవనాల్లో ముఖ్యమంత్రి కార్యాలయం, అలాగే అక్కడికి సమీపంలోనే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన మరో భవనంలో ముఖ్యమంత్రి నివాసం ఏర్పాటు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రుషికొండను తొలిచి నూతనంగా నిర్మించిన పర్యాటక శాఖ భవనాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుగుణంగా తీర్చిదిద్ది భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారనే వార్తలు వెలువడుతున్నాయి.