Kambhampati Parvathi Kumar Passed Away : ప్రముఖ సంఘ సేవకుడు, ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి పార్వతీ కుమార్ (77) కన్నుమూశారు. గుండెపోటు రావడంతో..గతరాత్రి ఇంట్లోనే ఆయన కుప్పకూలి పోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. మాస్టర్ ఇ.కె శిష్యుడైన పార్వతీకుమార్ గత కొన్ని దశాబ్దాలుగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థలు పేదలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పనా వంటి సేవా కార్యక్రమాల్లో ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నాయి.
134 దేశాలలో ఆధ్యాత్మికవేత్తగా పార్వతి కుమార్ ఖ్యాతి గడించారు. మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యులతో 18 ఏళ్ల పాటు కలిసి పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతో ప్రపంచం శాంతిమార్గం వైపు ప్రయాణించేలా అందరూ కృషి చేయాలని, మానవ సేవే మాధవ సేవ అని బోధించే పార్వతీకుమార్కు ఎంతో మంది శిష్యులు ఉన్నారు. విశాఖ నగరంలోని జగద్గురు పీఠం స్వచ్ఛంద సంస్థను ఆయన శిష్యులే నిర్వహిస్తున్నారు.
500 పైగా సెమినార్లలో ప్రత్యక్షంగా పాల్గొని మెడిటేషన్, యోగ, ఆస్ట్రాలజీ లపై ఆయన శిక్షణ ఇచ్చారు. హీలింగ్లో పలువురికి తర్ఫీదునిచ్చారు. ఈయన సతీమణి రెండేళ్ల క్రితమే గతించారు. ఆయనకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. ప్రతి శనివారం ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో మెడిలైఫ్ టీచర్స్పై శిక్షణ ఇస్తూ వచ్చారు. గురువారం సాయంత్రం పార్వతీకుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఇవీ చదవండి: