బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపానుగా మారుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. రానున్న 24 గంటల్లోనే ఇది తుపాను, తీవ్ర తుపానుగా మారే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నట్టు వివరించింది.
మత్స్యకారులకు హెచ్చరిక..
వాయుగుండం ఒడిశాలోని పారాదీప్‌కు 1060 కి.మీ. దూరంలో.. బంగాల్‌లోని దిఘాకు 1220 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. క్రమంగా ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగాల్, ఒడిశా తీరాలవైపు వెళ్లే అవకాశం కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ నెల 18 నుంచి ఒడిశాలోని తీరప్రాంతాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షం, తూర్పు తీరప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఒడిశా, బంగాల్ తీరప్రాంతాల్లో ప్రస్తుతం గంటకు 50-55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రేపటి నుంచి గాలుల ఉద్ధృతి మరింతగా పెరిగే అవకాశం ఉందని.. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
కురుస్తున్న వర్షాలు
గుంటూరు జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. తాడికొండ, మాచవరం, పిడుగురాళ్ల మండలాల్లో వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.