విశాఖ జిల్లాలో కరోనా కేసుల రికవరీ సంఖ్య 56 వేలకు చేరువైంది. జిల్లాలో ఇంతవరకు నమోదైన కేసుల్లో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 55,874గా నమోదైంది. కొత్తగా కొవిడ్ బారిన పడుతున్న వారికి లక్షణాల తీవ్రత ఎక్కువ లేనందున వారు ఆస్పత్రిలో ఉండాల్సిన పనిలేదు. కొత్తగా నమోదవుతున్న వారిలో 5 శాతం మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఆసుపత్రులపై
ఒత్తిడి తగ్గడానికి కారణమైంది. 4 జిల్లాల కొవిడ్ ఆసుపత్రి విమ్స్లోనూ.. పదుల సంఖ్యలోనే బాధితులు చికిత్స పొందుతున్నారు.
ప్రతి రోజూ కొత్త కేసుల సంఖ్య 100 నుంచి 150 వరకు నమోదవుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 1450 వరకు ఉంది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 57,807. మొత్తం మృతుల సంఖ్య 494గా ఉంది. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 6వేల మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గరిష్ఠ స్థాయిలో జిల్లాలో ఆగస్టు నెలలో దాదాపు 27 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. వీటి ఉద్ధృతి సెప్టెంబర్ నెలలో తగ్గింది. అక్టోబర్లో దాదాపు 7 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 75 వరకు నమోదైంది.
విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన 550 పడకల సామర్ద్యంతో సేవలందిస్తున్న కొవిడ్ వార్డులో 150 మంది బాధితులు ఉన్నారు. ప్రజలు కరోనా నివారణ చర్యలు పాటించి తీరాలని.. లేకుంటే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జిల్లాలో గిరిజన ప్రాంతంలోనూ కొవిడ్ బారిన పడుతున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నర్సీపట్నం, చోడవరం, ఎలమంచిలి వంటి ప్రాంతాలపై ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇదీ చదవండి: