Constable suicide: విశాఖ జిల్లా మధురవాడ జోన్ శివశక్తినగర్‌లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మద్దింశెట్టి సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం గ్రామానికి చెందిన మద్దిమశెట్టి సురేష్(34).. ఉద్యోగరీత్యా విశాఖలో ఉంటున్నాడు. సురేష్‌కు గతంలోనే పెళ్లైంది. ఆయనకు భార్య సునీత, మూడేళ్ల కుమార్తె ఉన్నారు.
అయితే.. కొంత కాలంగా సురేష్ మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని భార్యకు చెప్పాడు. కానీ.. ఆమె నిరాకరించింది. భర్త ప్రేమించిన యువతితో ఫోన్లో మాట్లాడింది. తమ కుటుంబానికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. కాగా.. నెల రోజుల క్రితమే కుమార్తెను తీసుకుని స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు వెళ్లింది సునీత.
ఈ క్రమంలో బుధవారం రాత్రి సురేష్.. భార్యకు ఫోన్ చేశాడు. తాను ప్రేమించిన యువతి తనను తిరస్కరించిందని.. దీంతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. ఆందోళనకు గురైన సునీత.. రాత్రి ఒంటిగంట సమయంలో తమ ఫ్లాట్‌కు సమీపంలోని వారికి ఫోన్ చేసి తన భర్త ఆత్మహత్య చేసుకుంటున్నాడన్న విషయాన్ని తెలిపింది.
వారు వెంటనే వెళ్లి తలుపులు తెరిచి చూసేసరికి.. అప్పటికే సురేష్ ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు.
ఇదీ చదవండి: