విశాఖ నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద సీఐటీయూ నిరసన ప్రదర్శన నిర్వహించింది. రాంకీ ఎస్ఈటిపి సాల్వేంట్స్ లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కాండ్రేగుల శ్రీనివాస్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఆధ్యక్షుడు సీ.హెచ్ నర్సింగ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్లిన సీఐటీయూ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు.
రాంకీ యాజమాన్యం నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని నర్సింగ్ రావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకమైన పరిశ్రమల్లో తనిఖీలు, భద్రత ఆడిట్ నిర్వహించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం జిల్లా, నగర కార్యదర్శులు కె.లోకనాధం, డాక్టర్ బి. గంగారం, సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు తదితరులు పాల్గొన్నారు.