కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను వెనక్కు తీసుకునే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు అన్నారు. భాజపా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, రైతు సంఘాలు ఇచ్చిన 'బ్లాక్ డే' పిలుపులో భాగంగా విశాఖ మహానగర పాలక సంస్థ వద్ద ప్రజా సంఘాలు నిరసన చేశాయి.
కరోనా కష్టకాలంలో ప్రజలు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే… మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. పీఎం కేర్ నిధులు కోట్ల రూపాయలు వచ్చినప్పటికీ, వాటిని దేశ ప్రజల వైద్యానికి ఖర్చుచేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని… ఈ చట్టాల వల్ల ఆహార కొరత ఏర్పడి ప్రజలపై పెనుభారం పడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తాయని అభిప్రాయపడ్డారు.
ఈ ఆందోళనలో అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ ఎం జగ్గు నాయుడు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు లోకనాథం, ప్రభుత్వ రంగ సంస్థల సమన్వయ కన్వీనర్ జ్యోతిశ్వరరావు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. 'యాస్' ఉగ్రరూపం- 11 లక్షల మంది తరలింపు