ఉన్మాదుల పాలన ఎలా ఉంటుందో జగన్ పాలనే నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ అండ ఉందనే అహంతో నేరగాళ్ల కళ్లు నెత్తికెక్కి ఎస్సీలపై వరుసగా దాడులు చేస్తున్నారని విమర్శించారు. విశాఖ జిల్లా తెదేపా నాయకులు, ఎస్సీ సంఘాల నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్సీలపై హత్యలు, శిరోముండనాలు, గ్యాంగ్ రేప్‌లు, బెదిరింపులు, వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. విశాఖలో ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి భూమిని ఆక్రమించడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు జరగని రోజు లేదన్న చంద్రబాబు...తొలిదాడి జరిగినప్పుడే కఠినంగా శిక్షిస్తే ఈ వరుస దాడులు జరిగేవా అని నిలదీశారు. 2 నెలల్లో 2 జిల్లాల్లో ఇద్దరు ఎస్సీ యువకులకు శిరోముండనాలా అని ప్రశ్నించారు.
ఎస్సీలపై దాడిచేసి, దానిని వీడియో తీయడం ఉన్మాద చర్యని మండిపడ్డారు. ఎస్సీలపై దాడులను జగన్ ఎందుకని ఖండించడం లేదని నిలదీశారు. వైకాపా నాయకుల దమనకాండకు జగన్ బాధ్యత వహించాలన్నారు. ఇది ఎస్సీల అంశమే కాదన్న చంద్రబాబు... మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. ప్రజాసంఘాలన్నీ ఈ దాడులను ఖండించడంతో పాటు ఎస్సీలపై దాడులు ఆగేదాకా ఎవరూ వెనకడుగు వేయొద్దని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: కొవిడ్‌పై సీఎస్‌కు చంద్రబాబు లేఖ