Blast in vishaka pharmacity: విశాఖపట్నం పరవాడ ఫార్మాసిటీలోని ‘ఆక్టినోస్’ ఔషధ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో రియాక్టర్ పేలుడు సంభించింది. ప్రమాదంలో నలుగురు ఉద్యోగులకు గాయాలయ్యాయి. పరవాడ సీఐ ఈశ్వరరావు, కంపెనీ ప్రతినిధులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కంపెనీలోని ప్రొడక్షన్ బ్లాకు-1లో ‘ఒసెల్టామివిర్ ఫాస్పేట్’ తయారీ చేస్తున్నారు. ఈ బ్లాకులో 25 రియాక్టర్లు ఉన్నాయి. కెమికల్ రియాక్షన్ కారణంగా ఒత్తిడి పెరగడంతో 5కేఎల్ సామర్థ్యం గల ఒక రియాక్టరుకు చెందిన మ్యాన్‌హోల్ మూత పేలిపోయింది. పేలుడు ధాటికి రియాక్టరు కిందపడిపోవడంతోపాటు బ్లాకు చెందిన గోడలు బీటలు వారాయి. వేడి కారణంగా కేబుల్స్ కాలిపోయి ప్రొడక్షన్ బ్లాకు మొత్తం నల్లగా తయారైంది.
భవనానికి ఉన్న గ్లాసులు ముక్కలై దూసుకెళ్లడంతో అక్కడ విధుల్లో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ప్లాంట్‌హెడ్ బొద్దులూరి రామకృష్ణ (45), ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ప్రొడక్షన్ ఇన్‌ఛార్జి బత్తుల నరేంద్రకుమార్ (45), పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన ప్రొడక్షన్ మేనేజర్ అర్మెల్లి హరికృష్ణ (38), విజయనగరానికి చెందిన కెమిస్టు సతీష్(24) గాయపడ్డారు. వీరిని లంకెలపాలెంలోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. స్వల్పగాయాలు కావడంతో చికిత్స అనంతరం ఇంటికి పంపారు. కార్మికులు భోజనాలకు వెళ్లిన సమయంలో ఘటన జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సీఐ ఈశ్వరరావు, ఎస్సై సురేష్, తహసిల్దార్ బి.వి.రాణి తదితరులు ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు.
విచారణ జరపాలి: సీఐటీయూ
ప్రమాదంపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన కంపెనీ బయట విలేకర్లతో మాట్లాడారు. భద్రతా ప్రమాణాలు పాటించకే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఘటనను గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఇదీ చదవండి: