విశాఖ జిల్లా(Visakhapatnam district) చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీలోని వెదురుపల్లి గ్రామానికి చెందిన గెమ్మెలి బాబూరావు భార్య దివ్య (27) నిండు గర్భిణి. లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెదురుపల్లి గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. కొండమార్గంలో కాలిబాటే శరణ్యం. దివ్య నాలుగో సారి గర్భం దాల్చింది. ఈమెకు అంతకు ముందు ఇద్దరు అబ్బాయిలు, ఒక పాప సంతానం. నిండు గర్భిణిగా ఉన్న ఈమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 108 అంబులెన్సుకు సమాచారం ఇద్దామన్నా రహదారి లేని పరిస్థితి అని కుటుంబసభ్యులు మిన్నకున్నారు.
ఇంతలో పురిటినొప్పులు అధికమవడంతో మంగళవారం ఇంట్లోనే ప్రసవించింది. పాపకు జన్మనిచ్చింది. కానీ.. కొద్దిసేపటికే ఈమె అస్వస్థతకు గురై మరణించింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శిశువు కళ్లు తెరవకముందే కన్నతల్లి దూరమవడంతో ఆ చిన్నారిని చూసి అంతా కన్నీరుమున్నీరవుతున్నారు. దివ్య మృతి(woman died)కి రక్తహీనతతోపాటు ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరగడమే కారణమని లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రామ్‌నాయక్ తెలిపారు. ఈమె నాలుగోసారి గర్భం దాల్చడంతో రక్తహీనతతో బాధపడుతోందని చెప్పారు.
- ఈ ఏడాది జులై 4న జి.మాడుగుల మండలం గెమ్మలిబారు గ్రామానికి చెందిన పాంగి జానకిని ప్రసవం కోసం తరలిస్తున్న క్రమంలో తల్లీబిడ్డా చనిపోయారు. ఈ గ్రామానికి రహదారి సదుపాయం లేకపోవడంతో డోలీలో మోసుకుంటూ వచ్చే క్రమంలో దారిలోనే మగబిడ్డను ప్రసవించింది. కాసేపటికే ఇద్దరూ మృత్యుఒడికి చేరిపోవడం కుటుంబ సభ్యులనే కాదు స్థానికులందరినీ కలచివేసింది.
- రెండు నెలల క్రితం ముంచంగిపుట్టు మండలం బూసిపట్టు నుంచి రహదారి సదుపాయం లేకపోవడంతో గర్భిణిని కష్టం మీద కొంత దూరం నడిపించారు. తరువాత ఓ ప్రైవేటు అంబులెన్స్ ఎక్కించగా కొంత దూరం వెళ్లాక బురదలో ఆ వాహనం టైరు కూరుకుపోయి కదల్లేదు. అటుగా వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడు మోటారుసైకిల్‌పై ఆ గర్భిణిని ఆసుపత్రికి తరలించగా ప్రసవనంతరం బిడ్డ చనిపోయింది.
- రెండేళ్ల క్రితం పాడేరు మండలం సంపాలు నుంచి గర్భిణిని ఆసుపత్రికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలోనే బిడ్డను ప్రసవించగా పుట్టిన బిడ్డ అక్కడే ప్రాణాలొదిలేసింది.
ఇదీ చదవండి