దేశంలో పరిశుభ్రమైన నగరాల జాబితాలో విశాఖ తొమ్మిదో స్థానం సాధించడానికి కారణమైన సంస్థలను గౌరవించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో శుక్రవారం జీవీఎంసీ నిర్వహించిన గౌరవ్ అవార్డ్సు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. సుమారు 20 సంస్థలను ఎంపిక చేసి ఈ అవార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చుతున్న తరుణంలో 24 గంటల పాటు అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు.
చెత్త రీసైకిల్ కోసం కాపులుప్పాడలోని పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తడిచెత్త ద్వారా బయోగ్యాస్ తయారు చేసే పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ అవార్డులు తీసుకున్న వారు మరింత కష్టపడాలని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి యూనిఫామ్స్, పీపీఈ కిట్లు అందజేశారు. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాధ్, స్వచ్ఛభారత్ అంబాసిడర్లు ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు, ఆచార్య బాలమోహన్‌దాస్, షిరీన్ రెహమాన్, డాక్టర్ ఎస్.వి.ఆదినారాయణరావు, అదనపు కమిషనర్ సన్యాశిరావు పాల్గొన్నారు.