ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులపై, వారి మద్దతుదారులపై దాడులు పెరిగిపోతున్నాయి. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం పెదనాగమయ్యపాలెంలో ఇలాంటి ఘటనే జరిగింది. పంచాయతీ 6వ వార్డు సభ్యుడిగా తెదేపా మద్దతుతో పోటీచేస్తున్న అభ్యర్థి తమ్ముడు తోట రాంబాబుపై గుర్తు తెలియని దుండగులు బ్లేడు,కత్తులతో దాడికి తెగబడ్డారు. సినీ ఫక్కీలో ముగ్గురు వ్యక్తులు ముసుగులు వేసుకొని అర్ధరాత్రి రాంబాబు ఇంటికి వెళ్లారు. అతనిపై బ్లేడు,కత్తులతో దాడి చేసినట్లు బాధిత బందువులు తెలిపారు. రాంబాబుకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వైకాపా కార్యకర్తల పనే..
పెదనాగమయ్యపాలెం సర్పంచి తమ్ముడు 3రోజుల కిందట తమను బెదిరించాడని, వైకాపా కార్యకర్తలే దాడి చేశారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. తనపై దాడి చేసిన వెంటనే పెద్దగా కేకలు వేయటంతో దుండగులు పరారయ్యారని... లేకపోతే హత్య చేసి ఉండేవారని క్షతగాత్రుడు వాపోయాడు. తనకు ప్రాణహాని ఉందని భీమిలి పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: విశాఖ జోన్‌పై తుది నిర్ణయానికి కాలపరిమితేం లేదు: కేంద్రం