Bogus votes with single house number in Bhimili constituency: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా బోగస్ ఓట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలను పరిశీలించినా, సర్వే చేసినా.. తప్పుల తడకలుగా దర్శనమిస్తున్నాయి. దీంతోపాటు వందల సంఖ్యల్లో బోగస్ ఓట్లు వెలుగు చూస్తున్నాయి. అంతేకాకుండా ఒకే ఇంటి నెంబర్‌పై పదుల సంఖ్యల్లో బోగస్ ఓట్లు ఉండటం తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది. తాజాగా విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఓటరు జాబితాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయంటూ విమర్శలు తలెత్తుతున్నాయి. ఒకే ఇంటి నెంబరుపై అధిక సంఖ్యలో ఓటర్లు ఉండడం సంచలనంగా మారింది.
తప్పుల తడకగా భీమిలి ఓటరు జాబితా.. ఏ ఎన్నికల్లోనైనా అభ్యర్థుల తలరాతలను విజేతలుగా నిర్ణయించేది ఓటర్లు. అయితే, ఓటరు జాబితాలో పేరు ఉంటేనే అంతిమంగా ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ, విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో కొంతమంది అధికారపార్టీ నేతలు.. పార్టీకీ వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను జాబితాలో లేకుండా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారుల సహకారం తీసుకుని ఓట్ల జాబితానే తప్పుల తడకలుగా రూపొందించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. కీలకమైన పేజీల్లో.. చిరునామాలను గందరగోళంగా నమోదు చేశారు. దీంతో విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓటరు జాబితాలపై టీడీపీ నేతలు ఆగ్రహం.. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఓటరు జాబితాలు చిత్రవిచిత్రంగా ఉన్నాయని.. తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు. ఒకే ఇంటి నెంబర్‌తో పదుల సంఖ్యలో ఓటర్లు నమోదయ్యి ఉన్నాయని పేర్కొన్నారు. ఓటర్ల ఇంటి నెంబర్లు కూడా తప్పటడుగులుగా కనిపిస్తున్నాయని వాపోయారు. ఒకే ఇంటి నెంబరు 10,000, 000, 0000 11తో పలు చోట్ల అధిక సంఖ్యలో ఓటర్లు ఉండడం పలు అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు. 11 ఇంటి నెంబరుతోనే అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నారని.. ఇదే డోర్ నెంబర్ నియోజకవర్గంలోని పలు చోట్ల 100 నుంచి కొనసాగడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోందన్నారు. భీమిలి నియోజవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని.. ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవకుండా చేయాలన్న లక్ష్యంతోనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. పద్మనాభం మండలం భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతం. ప్రతి గ్రామంలోనూ ఆ పార్టీకి గట్టి బలం ఉంది. అటువంటి చోట ఓట్లను తొలగించేందుకు.. ఓటర్ల జాబితాలు చాలా అనుమానాస్పదంగా తయారు చేశారని తెలిపారు.
కొత్త ఓటర్లకు ఓకే ఇంటి నెంబర్.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నవీకరించిన ఓటర్ల జాబితా ప్రకారం.. పద్మనాభం మండలంలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. అనేక గ్రామాల్లో 1-1 ఇంటి నెంబరుతో ఎక్కువ ఓట్లు కనిపిస్తున్నాయి. అసలైన నెంబర్లు ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా కొన్ని చోట్ల ఈ (11) నెంబరే దర్శనమిస్తోంది. అధికారులు ఆధార్ కార్డు ఆధారంగా నమోదు చేసినట్లు చెబుతున్నా.. కొత్తగా చేర్చిన ఓటర్లకు కూడా అదే నెంబర్‌ను కేటాయిచారు. ఇదే మండలం కోరాడలోని ఆరు వీధుల్లో మొత్తం 1301 ఓట్లు ఉంటే.. ఇందులో 300 మంది ఓటర్లకు 1-1 ఇంటి నెంబరే ఉంది. ఇక్కడ వీధిలో 136 మంది ఓటర్లు, ఎస్సీ కాలనీలో 33, బర్లవారి కళ్లాలులో 20 మంది ఓటర్లు ఉన్నారు. విచిత్రంగా 9.11.2022 నుంచి 5.1.2023 మధ్యలో కొత్తగా చేర్చిన 34 మంది ఓటర్ల ఇంటి నెంబరు కూడా 1-1గానే పేర్కొన్నట్లు టీడీపీ నేతలు తెలియజేశారు.
మరోవైపు 'పద్మనాభం మండలం వెంకటాపురానికి చెందిన కొయ్య పైడిరాజు (ఎన్‌ఎక్సే1804484) అనే ఓటర్ సీరియల్ నంబరు 8. ఆ యువకుడిని కొత్త ఓటరు జాబితాలో ఇంటి నెంబరు 1-1తో చేర్చారు. అతని ఇంటికి వేరే ఇంటి నెంబరు ఉన్నా అది వేయలేదు. అతని ఇంటి నెంబరు మాత్రం 2-65గా ఓటరు జాబితాలో పేర్కొన్నారు. అయితే, ఒకే గ్రామంలో ఒకే ఇంటి నెంబర్ వద్దనడంతో.. కుటుంబ సభ్యుల ఇంటి నెంబర్లను మార్చేసి '00' ఇంటి నెంబరుతో చేర్చేశారు. కోరాడ గ్రామంలో స్థానికంగా లేని ముగ్గురు ఓటర్లను చేర్చారు. మహ్మద్ సుహైల్ అస్రఫ్ ఖాన్ (ఎన్డీఎక్స్ 5190178), అమ్నాఖాన్ (ఎన్‌ఎక్స్ 5190186), మహ్మద్ రెపన్ ఖాన్ (ఎన్ఎఎక్స్ 5190194) వీరు స్థానికులు కారు. ఎప్పుడో అక్కడ స్థలాలు కొనుగోలు చేసి విక్రయించేశారు. అయినప్పటికీ ఇంటి నెంబరు 00తో ఓటర్లుగా చేర్చేశారు. ఇలా ఎన్నో తప్పుడు పేర్లతో ఒకే ఇంటి నెంబర్‌తో ఓట్లు నమోదు చేశారు.' అంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.