రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ "పరివర్తన" పేరుతో గంజాయి నిర్మూలనపై ప్రత్యేక నిఘా పెట్టారు. విశాఖ ఏజెన్సీలో గత మూడు రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. జి.మాడుగుల, జి.కె వీధి మండలాలలోని 270 ఎకరాలలో సాగుచేస్తున్న గంజాయి సాగును ధ్వంసం చేశారు. లేబర్, ఐటీడీఏ, రెవెన్యూ, ఫారెస్ట్, ఎస్ఈబీ సమన్వయంతో గంజాయి ధ్వంసం చేశారు. మొత్తం 700-800 మంది సిబ్బందితో 10 బృందాలుగా ఏర్పడి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతంలో.. అక్కడి అధికారుల సమన్వయంతో గంజాయి ధ్వంసం చేస్తున్నారు. మొత్తం 390-400 ఎకరాల్లో హై గ్రేడ్ గంజాయి సాగు జరుగుతున్నట్లు సమాచారం.
కొన్ని ప్రాంతాల్లో ఇకపై గంజాయి సాగు చేపట్టబోమని నిర్ణయించుకుంటూ గిరిజనులంతా ఏకమై తోటలను ధ్వంసం చేశారు. అరకులోయ మండలంలోని పద్మాపురం పంచాయతీ పింపల్‌గుడ సమీపంలోని సుమారు 2 ఎకరాల్లోని గంజాయి మొక్కలను మంగళవారం గిరిజనులు తొలగించారు. గూడెంకొత్తవీధి మండలంలోని ఏడు గ్రామాల్లో సీఐ అశోక్‌కుమార్, అటవీశాఖ బీట్ అధికారి గోవింద్ ఆధ్వర్యంలో 60 ఎకరాల గంజాయి తోటలను ధ్వంసం చేశారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు నిర్మూలనకు స్వచ్ఛందంగా పలు గ్రామాల ప్రజలు నడుంబిగించి ముందుకొచ్చారని డి.ఐ.జి ఎల్.కె.వి.రంగారావు ఓ ప్రకటనలో కొనియాడారు.
ఇదీ చదవండి: