కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలని విశాఖ జిల్లా పాయకరావుపేట కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పాయకరావుపేట అసెంబ్లీ ఇన్ఛార్జి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కార్పొరేట్ శక్తులకు అవకాశమిచ్చినట్లే..
రైతులను ఇబ్బంది పెట్టే జీవో నెంబర్ 22ను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూతన బిల్లులు కార్పొరేట్ శక్తులకు అవకాశం కల్పించినట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు అన్నదాతలను బానిసలుగా చేసేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల కక్షపూరిత విధానాలు మానుకోవాలని కేంద్రానికి హితవు పలికారు.
